పెళ్లయ్యాక కుటుంబం కోసం కెరీర్‌ను వదులుకొని హౌస్‌వైఫ్‌గా స్థిరపడిన పెద్ద పెద్ద తారలెందరినో మనం చూశాం. అలాగే కెరీర్ కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యమనుకొని పెళ్లిచేసుకొనేవాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అందుకు విరుద్ధంగా సినిమా కెరీరే ముఖ్యమనుకొని సంసారాన్ని కూడా వద్దనుకున్న తారలుంటారా? ఉంటారని కొంతమంది నిరూపిస్తున్నారు. వ్యక్తిగత లేదా వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించి, ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్రవేసిన అలాంటి తారల గురించి చెప్పుకుందామా...
మల్లికా షెరావత్
బాలీవుడ్లో మెరుపులా మెరవడమే కాదు.. శృంగారనాయికగా కొంతకాలం ఓ ఊపు ఊపేసిన తార మల్లికా షెరావత్. పంజాబీ భామ అయిన ఆమె అసలు పేరు రీమా లాంబా. సినిమాల్లో అడుగుపెట్టాక పేరు మార్చుకుంది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ కరణ్‌సింగ్ గిల్ అనే పైలట్‌ను పెళ్లాడింది. ఆమె ఆశయం సినీనటి కావడం. కానీ పెళ్లితో ఆ ఆశయం నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో కెరీరే ముఖ్యమనుకున్న మల్లిక డివోర్స్ తీసేసుకుంది. ఆ తర్వాత మోడలింగ్ మీద శ్రద్ధపెట్టి, యాడ్స్‌లో నటించింది. అతి త్వరగానే బాలీవుడ్ పిలుపందుకొని 2003లో 'ఖ్వాహిష్' మూవీలో హిమాంశు మాలిక్ సరసన నాయికగా నటించింది. ఇందులో మాలిక్‌తో 17 కిస్ సీన్స్‌లో నటించి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత 2004లో వచ్చిన మర్డర్ మూవీతో ఆమెకు వచ్చిన ఇమేజ్ మనలో చాలామందికి తెలిసిందే. 43 సంవత్సరాల మల్లిక గత ఏడాది 'బూ సబ్కీ ఫటేగీ' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.
చిత్రాంగదా సింగ్
పేరుపొందిన గోల్ఫ్ ప్లేయర్ జ్యోతిసింగ్ రణ్‌ధావాను 2001లో పెళ్లాడిన చిత్రాంగద, ఆ తర్వాత రెండేళ్లకు సుధీర్ మిశ్రా డైరెక్ట్ చేసిన 'హజారోం ఖ్వాయిషీ ఐసీ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. కుమారుడు జొరావర్ పుట్టాక కూడా నటిగా కొనసాగడానికే డిసైడ్ చేసుకున్న ఆమె ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చడం భర్త జ్యోతిసింగ్కు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. అప్పట్నుంచీ ఇద్దరి మధ్యా మొదలైన గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ తమ గొడవలను బహిరంగంగా చెప్పుకోలేదు. 2013లో విడిపోయిన వారికి 2014లో విడాకులు మంజూరయ్యాయి. 'యే సాలీ జిందగీ', 'దేశీ బాయ్స్' సినిమాలలో అలరించిన చిత్రాంగద.. 'ఇన్కార్' మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండేళ్ల క్రితం 'బాజార్'లో నటించిన 44 ఏళ్ల చిత్రాంగద ఈ ఏడాది 'ఘూమ్కేతు'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది.
అదితిరావ్ హైదరి
అదితిరావ్ తెలంగాణ అమ్మాయి. ఆమె తండ్రి హైదరాబాద్ ముస్లిం రాజవంశానికి చెందిన వ్యక్తి కాగా, ఆమె తల్లి వనపర్తి జమీందారుల బిడ్డ. ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ ఆమెకు తల్లితరపు సమీప బంధువు. 2006లో మలయాళంలో 'ప్రజాపతి' అనే సినిమాలో నటించిన అదితి 2009లో 'ఢిల్లీ 6' మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సుధీర్ మిశ్రా సినిమా 'యే సాలీ జిందగీ'లో చిత్రాంగదా సింగ్‌తో పాటు నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. 21 ఏళ్ల వయసులోనే సత్యదీప్ మిశ్రా అనే నటుడ్ని పెళ్లాడింది. అయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. చాలా కాలం వరకు అదితి పర్సనల్ లైఫ్ గురించి ప్రపంచానికి తెలీదు. 2013లో భర్తతో వేరుపడి, యాక్టింగ్ కెరీర్‌కే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. 2018లో 'సమ్మోహనం' చిత్రంతో టాలీవుడ్లో ప్రవేశించి, తన సౌందర్యం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. 40 ఏళ్లొచ్చినా అంత వయసు ఉన్నదానిలా కనిపించని అదితి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి.
నర్గీస్ ఫఖ్రీ
న్యూయార్క్‌కు చెందిన నర్గీస్ ఫఖ్రీ నటి కావడం కోసం ఇంటినీ, బాయ్ఫ్రెండ్నీ వదిలిపెట్టి ముంబైకి వచ్చేసింది. 2009 కింగ్‌ఫిషర్ స్విమ్‌సూట్ క్యాలెండర్ కోసం పోజులచ్చింది. అదే ఆమె దశను మార్చేసింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా 2011లో తను రూపొందించిన మ్యూజికల్ ఫిల్మ్ 'రాక్‌స్టార్'లో హీరోయిన్గా ఆమెనే చూశాడు డైరెక్టర్ ఇంతియాజ్ అలీ. పెళ్లిచేసుకొని జీవితంలో స్థిరపడటం కంటే కెరీరే ముఖ్యమని భావించినందునే పద్నాలుగేళ్ల క్రితం ఆమె అన్నీ సర్దుకొని ఇండియాకు వచ్చింది. ఆమె తండ్రి పాకిస్తానీ, తల్లి చెక్ మహిళ. ఈ తొమ్మిదేళ్లలో చేసింది తొమ్మిది సినిమాలే అయినా అన్నింటిలోనూ పేరు తెచ్చుకుంది. ఇవి కాకుండా మరో నాలుగు సినిమాల్లో స్పెషల్ అప్పీరెన్సులు ఇచ్చింది. 40 సంవత్సరాల నర్గీస్ ప్రస్తుతం 'తోర్బాజ్'లో నటిస్తోంది.
మహీ గిల్
2003లోనే 'హవాయే' మూవీలో నటించి, పంజాబీ చిత్రసీమకు వెళ్లిన మహీ గిల్‌కు 2009లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'దేవ్ డి' మూవీతో బంపర్ ఆఫర్ తగిలింది. శరత్చంద్ర ఛటర్జీ ప్రఖ్యాత నవల 'దేవదాస్'కు ఆధునిక రూపంలా తయారైన ఈ చిత్రంలో పార్వతి పాత్రలో రాణించింది మహీ. అయితే నటి కావడం ఆమెకు నల్లేరు మీద నడక కాలేదు. ఆమె వైవాహిక జీవితం విచ్ఛిన్నమై డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో చాలా రోజులు డిప్రెషన్లో ఉంది. దాన్నుంచి బయటపడి, సినీ నటిగా కెరీర్‌ను వెతుక్కోవాలనే ఉద్దేశంతో చండీగఢ్ నుంచి ముంబైకి వచ్చింది. ఆమె కలలకు ఓ రూపాన్నిచ్చింది 'దేవ్ డి' మూవీ. విరానికా అనే కూతురిని చూసుకుంటూ, ప్రస్తుతం మరొకరి ప్రేమలో ఉంది మహీ. 44 ఏళ్ల ఆమె 'ఆర్ఫన్ ట్రైన్' సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తోంది.