![]() |
![]() |

సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది. రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐఆర్సీటీసీ తరహాలో సినిమా టికెట్లను అమ్మేందుకు వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. తాజాగా సినీ దర్శకుడు దేవ కట్టా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రైల్వేస్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి.. రైల్వే టికెట్లను ప్రభుత్వం ఆన్ లైన్ లో విక్రయించడం సబబేనని దేవ కట్టా అన్నారు. కానీ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన సినిమాల టిక్కెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఇకపై సినిమాలు తీసిన నిర్మాతలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మాదిరి డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నిల్చోవాలేమోనని విమర్శించారు. లేదంటే సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందా అని దేవ కట్టా ప్రశ్నించారు.
'వెన్నెల' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన దేవ కట్టా.. 'ప్రస్థానం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, డైనమైట్, ప్రస్థానం హిందీ రీమేక్ సినిమాలతో పలకరించారు. లేటెస్ట్ గా సాయి తేజ్ తో 'రిపబ్లిక్' మూవీ చేశారు.
![]() |
![]() |