![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన కెరీర్ లో తనని వెతుక్కుంటూ వచ్చిన చాలా కథలను కాదనుకున్నాడు. అలా తారక్ రిజెక్ట్ చేసిన కొన్ని స్టోరీలతో ఇతర హీరోలు సినిమాలు చేయగా.. వాటిలో పలు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందులో 'దిల్', 'ఆర్య', 'భద్ర', 'కిక్' వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా ఎన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకున్నప్పటికీ.. ఎన్టీఆర్ బిగ్ స్టార్ గా ఎదిగాడు. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు. అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా.. తారక్ తీరులో మార్పు లేదు. తనని వెతుక్కుంటూ వచ్చిన కథలను కాదనుకుంటున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan) తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి 'పెద్ది' అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. అయితే నిజానికి ఈ 'పెద్ది' సినిమా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. మొదట ఎన్టీఆర్ కే బుచ్చిబాబు ఈ కథ చెప్పాడు. స్టోరీ నచ్చి బుచ్చిబాబుతో సినిమా చేయడానికి తారక్ కూడా రెడీ అయ్యాడు. తారక్ ని దృష్టిలో పెట్టుకునే.. కొద్దినెలలపాటు ఆ స్క్రిప్ట్ ని కూడా డెవలప్ చేశాడు బుచ్చిబాబు. అయితే ఇతర భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం, లేదా ఏవో ఇతర కారణాల వల్ల 'పెద్ది' ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టోరీ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళింది. అయితే, ఎన్టీఆర్ సూచనతోనే చరణ్ కి బుచ్చిబాబు ఈ కథని వినిపించాడని అంటుంటారు. ఏది ఏమైనా 'పెద్ది' అనేది పవర్ ఫుల్ స్టోరీ అని, హీరో పాత్రకి కూడా పర్ఫామెన్స్ కి ఎంతో స్కోప్ ఉందని.. అలాంటి స్క్రిప్ట్ ని వదులుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఇక అల్లు అర్జున్ (Allu Arjun) తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇది మైథలాజికల్ టచ్ తో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. అయితే నిజానికి ఇది కూడా ఎన్టీఆర్ తో చేయాల్సిన కథనే. 'ఆర్ఆర్ఆర్' తర్వాతి సినిమాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటించాడు ఎన్టీఆర్. ఆ సినిమాకి "అయినను పోయి రావలె హస్తినకు" అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఆ సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, పోస్ట్ పోన్ అయిందని.. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. అయితే అప్పుడు ఎన్టీఆర్ తో అనుకున్న ఆ కథతోనే.. ఇప్పుడు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అదే నిజమైతే.. తారక్ ఓ మంచి ఆఫర్ ని వదులుకున్నట్లు అవుతుంది. నందమూరి హీరోలకు మైథలాజికల్ కథలు బాగా సెట్ అవుతాయి. పైగా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఆ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని వదులుకోవడమంటే.. బిగ్ మిస్టేక్ అవుతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి ఏవో కారణాల వల్ల ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాలు.. రామ్ చరణ్, అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధిస్తే మాత్రం.. ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
![]() |
![]() |