![]() |
![]() |

'బప్పీలహిరి' పేరు వింటే సంగీతంతో పాటు మనకు గుర్తుకొచ్చేది బంగారం. ఎప్పుడూ ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కనిపించేవారు ఆయన. ఒకవేళ బంగారం ధరించకుండా బయటకు వెళ్తే తననెవరూ గుర్తుపట్టరు అని సరదాగా అనేవారు బప్పీలహిరి. అయితే ఆయన అలా బంగారం ధరించడం వెనక ఓ స్టోరీ ఉంది. ఒకరి కారణంగా బంగారంపై ఇష్టం పెరిగిందని, మరొకరి కారణంగా బంగారం తనకు అదృష్టంగా మారిందని గతంలో బప్పీలహిరి ఓ సందర్భంలో చెప్పారు.
"చిన్నప్పటి నుంచి హాలీవుడ్ పాప్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీకి అభిమానిని. ఆయన ఎక్కువగా గోల్డ్ చైన్స్ ధరించేవాడు. ఆయన ఆహార్యం నన్ను ఎంతగానో ఆకర్షించింది. జీవితంలో ఎదిగి గొప్ప పేరు, డబ్బు సంపాదించి.. ఆయనలా బంగారు ఆభరణాలు ధరించాలి అనుకునేవాడిని. 'జాక్మీ' పాటల రికార్డింగ్ సమయంలో మా అమ్మ ఓ గోల్డ్ చైన్ ను బహుమతిగా ఇచ్చింది. ఆ అల్బమ్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరో గోల్డ్ చైన్ ఇవ్వగా నాకు పెళ్లయింది. అప్పటినుంచి బంగారాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా బంగారు ఆభరణాలు ధరించడం అలవాటుగా మారింది. పబ్లిక్ లోకి కూడా బంగారంతోనే వెళ్తుంటాను. ఇవి లేకుండా బయటకు వెళ్తే ప్రజలు నన్ను గుర్తు పట్టలేరు’’ అని బప్పీలహిరి చెప్పారు.
బప్పీలహిరి బంగారాన్ని దైవంగా, అదృష్టంగా భావించేవారు. ఆయన 'గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ లో తన వద్ద 754గ్రాముల బంగారం, 4.62కిలోల వెండి ఉందని.. తన భార్య వద్ద 967గ్రాముల బంగారం, 8.9కిలోల వెండి ఉందని పేర్కొన్నారు.
![]() |
![]() |