![]() |
![]() |
.webp)
తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విరాట పర్వం' ఒకటి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
'విరాట పర్వం' ట్రైలర్ తాజాగా విడుదలైంది. నక్సల్స్ నేపథ్యంలో 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలనలే స్థాపించగ ఎన్నినాళ్ళు?" అంటూ రానా వాయిస్ తో, సాయి పల్లవి విజువల్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ప్రజల కోసం తుపాకీ పట్టి పోరాడే రవన్న(రానా)తో వెన్నెల(సాయి పల్లవి) ప్రేమలో పడుతుంది. ఓ వైపు రవన్న దళం యుద్ధం, మరోవైపు వెన్నెల ప్రేమ యుద్ధంతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. "రక్తపాతం లేనిదెక్కడ?.. మనిషి పుట్టకలోనే ఉంది", "శాంతి తుపాకీ గొట్టంలో లేదురా.. ఆడపిల్ల ప్రేమలో ఉంది", "ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది" వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. డానీ సాలో, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |