![]() |
![]() |

ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కథానాయిక లావణ్యా త్రిపాఠీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసని ఆమె అన్నారు. రోజు రోజుకీ కరోనా మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ఇటీవల తన చేతి వేళ్లకు గాయమైనా హాస్పటల్కి వెళ్లలేదని లావణ్యా త్రిపాఠీ తెలిపారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లోని ఇంటికి పరిమితమైన డెహ్రాడూన్ 'అందాల రాక్షసి' మాట్లాడుతూ ‘‘సుమారు పది రోజుల క్రితం ఇంటిలో కిటికీ రెక్క బలంగా వేశా. అయితే... డోర్ మధ్యలో నా వేళ్లు ఉన్న సంగతి మర్చిపోయా. గట్టిగా డోర్ పడటంతో వేళ్లు పచ్చడి పచ్చడి అయ్యాయి. చాలా నొప్పి వేసింది. కానీ, హాస్పటల్కి వెళ్లలేదు. కరోనా పరీక్షలు, చికిత్సలతో హాస్పటల్స్ బిజీగా ఉంటాయి. అందుకని, వెళ్లలేదు. ఎమర్జన్సీ అయితేనే బయటకు వెళ్లాలి’’ అని అన్నారు. అలాగే, పర్సనల్ స్టాఫ్ విధులకు రాకపోయినా జీతాలు ఇవ్వడం ఆపవద్దని అన్నారు.
సాధారణంగా తాను తక్కువగా బయటకు వెళతానని, లాక్డౌన్ వల్ల అసలు వెళ్లడం లేదని లావణ్యా త్రిపాఠీ అన్నారు. తనకు మామూలుగా వంట చేయడం ఇష్టమేననీ, ప్రస్తుతం తన వంట తానే చేసుకుంటున్నానని ఆమె తెలిపారు. లావణ్యా త్రిపాఠీకి ఉత్తరాది వంటలు అన్నీ వచ్చట. దక్షిణాది వంటల్లో దోసెలు తినడం అయితే ఇష్టమట. సొంతూరు డెహ్రాడూన్ వెళ్లినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు దోసెలు వేసి పెడతారట.
![]() |
![]() |