![]() |
![]() |

మహేశ్‌తో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో అనిల్ రావిపూడి టాలీవుడ్‌లోని టాప్ లీగ్ డైరెక్టర్స్‌లో ఒకడయ్యాడు. దాని తర్వాత 'ఎఫ్2' సీక్వెల్ 'ఎఫ్3' కోసం స్క్రిప్ట్ పనిలో అతను నిమగ్నమయ్యాడని మనందరికీ తెలుసు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో లేడు. ప్రకాశం జిల్లాలోని తన సొంత ఊళ్లో ఉన్నాడు. అక్కడే ఆ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. ఆసక్తికరమైన విషయమేమంటే 'ఎఫ్3' అనేది 'ఎఫ్2'కు సీక్వెల్‌లా ఉండదంట. 'ఎఫ్' అనేదాన్ని ఒక ఫ్రాంచైజ్ తరహాలో తను రూపొందించనున్నట్లు అనిల్ చెప్పాడు. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో ఫ్రాంచైజ్ అనేది రాలేదనీ, తనే దాన్ని పరిచయం చేయబోతున్నాననీ అతనన్నాడు.
బాలీవుడ్‌లో మనం 'గోల్‌మాల్', 'ధూమ్', 'హేరా ఫేరి' వంటి ఫ్రాంచైజ్ మూవీస్ చూశాం. అంటే ప్రధాన పాత్రలు కొనసాగుతాయి కానీ, ఒక్కో సినిమా ఒక్కో బ్యాగ్రౌండ్‌తో ఉండటం ఆ సినిమాల ప్రత్యేకత. హాలీవుడ్‌లోని 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ కూడా ఇలాగే ఉంటుంది. వాటి తరహాలోనే ఇప్పుడు ఎఫ్3లోనూ ఎఫ్2లో ఉన్న ప్రధాన పాత్రలు కొనసాగుతాయి. అంటే వెంకటేశ్, వరుణ్‌తేజ్ కేరక్టర్స్ అన్నమాట. 'ఎఫ్2' బ్యాక్‌డ్రాప్‌కు భిన్నమైన బ్యాక్‌డ్రాప్, కథను మనం 'ఎఫ్3'లో చూస్తామని అనిల్ రావిపూడి అంటున్నాడు. 'ఎఫ్2'ను నిర్మించిన దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనేది వాళ్ల ఆలోచన. హీరోయిన్లతో పాటు మూడో హీరో ఎంపిక జరగాల్సి ఉంది.
![]() |
![]() |