![]() |
![]() |

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేసిన 'రాజా ది గ్రేట్' మూవీ తర్వాత మళ్లీ హిట్ చూడలేదు రవితేజ. వరుస నాలుగు ఫ్లాపులు - టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా - వచ్చాయి. గత చేదు అనుభవాల్ని తలచుకుంటూ కుంగిపోయే రకం కాదు రవితేజ. నేలకు కొట్టిన బంతి, అంతకంటే ఎక్కువ ఫోర్స్‌తో పైకి లేస్తుందనే టైపు అతడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేస్తున్న 'క్రాక్' మూవీ దానికి నిదర్శనంగా నిలుస్తుందని అతను నమ్ముతున్నాడు. గోపీచంద్‌తో అతను ఇదివరకు చేసిన రెండు సినిమాలు - 'డాన్ శీను', 'బలుపు' - ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. 'బలుపు'లో హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ తాజా 'క్రాక్'లోనూ అతడితో జోడీ కట్టింది. కరోనా గొడవ లేనట్లయితే మే 8న రిలీజై, తాడో పేడో తేల్చాలనుకున్నాడు రవితేజ. అయితే అతడి సంబరాలను ప్రస్తుత పరిస్థితులు వాయిదా వేశాయి.
అయినప్పటికీ ఇంట్లో తన కుటుంబంతో బాగానే ఎంజాయ్ చేస్తున్నానని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేశాడు రవితేజ. 'క్వారంటైన్‌లో ప్రతి రోజూ ఆదివారమే' అనే క్యాప్షన్‌తో ఆదివారం ఒక ఫొటోను షేర్ చేశాడు. అందులో ఒకవైపు కొడుకు మహాధన్, ఇంకోవైపు కూతురు మోక్షద కౌగలించుకోగా.. వాళ్లిద్దరినీ పొదివి పట్టుకొని నవ్వులు చిందిస్తున్నాడు రవితేజ. చూడగానే ఫాదర్ అండ్ చిల్డ్రన్ క్యూట్ పిక్చర్ అనిపించేలా ఆ ఫొటో ఉంది. ఆ ఫొటో తీసిందెవరే విషయం రవితేజ చెప్పలేదు కానీ, భార్య కల్యాణే దాన్ని తీసినట్లు ఊహించుకోవచ్చు. 'ఇంట్లో ఉండండి, ఆనందంగా ఉండండి' అని కూడా ఆ ఫొటోతో చెప్పాడు రవితేజ.
![]() |
![]() |