![]() |
![]() |

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లను హీరోలు టీజ్ చేసే సీన్లు బాగా కనిపించేవి. మనవరకు 'ఇడియట్'లో రక్షితను రవితేజ టీజ్ చేసే సీన్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ తరహా కథలు తగ్గిపోవడంతో టీజింగ్ సీన్లూ తగ్గిపోయాయి. ఒకవేళ ఉన్నా వాటిని విమర్శకులు చీల్చి చెండాడుతుంటారు. అయితే ఇప్పుడు ఒక భయంకర టీజింగ్ సీన్ హెడ్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. సంచలన తార రష్మికా మందన్న కన్నడంలో పొగరు అనే సినిమా చేస్తోంది. అందులో ధ్రువ సర్జా హీరో. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో రష్మికను ధ్రువ దారుణంగా హింసిస్తూ కనిపించాడు. మిగతావాళ్లు అది సినిమాలో భాగమని ఊరుకుంటారు కానీ.. మహిళా సంఘాలు ఊరుకుంటాయా? అదే జరిగింది.
సినిమా రిలీజయ్యాక కానీ ఆ పాట ప్రాముఖ్యం కానీ, హీరోయిన్‌ను హీరో అలా ఎందుకు టీజ్ చేస్తున్నాడనే విషయం కానీ స్పష్టం కాదు. కానీ కరాబు.. బాసూ కరాబు అనే ఆ సాంగ్‌లో రష్మికను ధ్రువ అల్లరి చేసే తీరు నిజంగానే అభ్యంతరకరంగా, ఘోరంగా ఉందని చెప్పక తప్పదు. అది అల్లరి కాదు, హింస అని చెప్పాలి. పాటలో రెండు మూడు సార్లు రష్మిక జుట్టు లేదా మెడ పట్టుకొని ఆమె ముఖాన్ని తన ముఖం దగ్గరకు తెచ్చుకోవడం, కాలును ఆమె నడుముపై ఒకసారి, పొట్టపై ఒకసారి అభ్యంతరకరంగా వేయడం వంటివి కనిపిస్తాయి. మొత్తంగా ఆ పాటను డైరెక్టర్ నందకిశోర్ క్రూరంగా చిత్రీకరించాడని చెప్పక తప్పదు.
అందుకే దీనిపై కర్ణాటకలోని మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆ పాట మహిళలను అవమానపరిచేదిగా ఉందనీ, ఆ పాటను నిషేధించి, దర్శక నిర్మాతలు, హీరోపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తుండటమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. దీంతో దర్శక నిర్మాతలకు గొంతులో పచ్చి వెలక్కాయి పడిందంటున్నాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాపడింది.

![]() |
![]() |