![]() |
![]() |

సినిమా రంగంలో అయినా, రాజకీయ యవనికపైనా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శైలి ఎప్పుడూ విలక్షణమే. తనను గుండెల్లో పెట్టుకునే అభిమానుల కోసం ఆయన ఎంతటి దూరమైనా వెళ్తారని మరోసారి రుజువైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ (Niranjan) అనే యువకుడు అరుదైన జన్యుపరమైన వ్యాధి అయిన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) తో పోరాడుతున్నాడు. కేవలం ఏడేళ్ల వయసులోనే ఈ మహమ్మారి బారిన పడి, కనీసం మంచం పైనుంచి లేవలేని స్థితిలో, కేవలం ఇల్లే ప్రపంచంగా బతుకుతున్నాడు. టీవీలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ, ఆ నటనకు ఫిదా అయిన నిరంజన్.. తన ముద్దుపేరును కూడా 'చోటా గబ్బర్ సింగ్' అని పెట్టుకున్నాడు. చనిపోయేలోపు తన జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌ను కలవాలనేది ఆ బాలుడి చివరి కోరిక.
జనసేన సోషల్ మీడియా, తెలంగాణ నేతల ద్వారా ఈ హృదయవిదారక విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన అత్యంత బిజీ రాజకీయ షెడ్యూల్ పక్కన పెట్టి, బుధవారం స్వయంగా వరంగల్‌లోని నిరంజన్ నివాసానికి చేరుకున్నారు. లేవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారి అభిమానిని చూసి పవన్ తీవ్రంగా చలించిపోయారు. ఏమాత్రం సంకోచించకుండా నిరంజన్ మంచం పైనే కూర్చుని, అతన్ని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో పవన్‌ను చూసిన ఆనందంలో నిరంజన్ మొహంలో వెలిగిన వెలుగు, ఆ కుటుంబ సభ్యుల కళ్లలో కురిసిన భావోద్వేగ ఆనందబాష్పాలు అక్కడున్న వారిని కదిలించాయి. దాదాపు 40 నిమిషాల పాటు ఆ ఇంట్లోనే గడిపిన పవన్, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు అందజేసి కొండంత మానసిక ధైర్యాన్ని నింపారు.
ఈ ఆత్మీయ కలయికలో నిరంజన్.. రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్క పిల్ల బొమ్మను చూపించి, తనకు అలాంటి పెంపుడు కుక్కను పెంచుకోవాలని ఉందని పవన్‌తో తన మనసులోని మాట చెప్పాడు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. "నువ్వు అడిగిన కుక్క పిల్లను 24 గంటల లోపు పంపిస్తా" అని మాట ఇచ్చారు. అయితే ఇల్లు అద్దెది కావడం వల్ల యజమానులు కుక్కను పెంచుకోవడానికి ఒప్పుకోరని నిరంజన్ తండ్రి రాము చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ ఇంటి ఓనర్లను అక్కడికక్కడే పిలిపించి మాట్లాడి, బాబు కోరిక కోసం సహకరించాలని కోరారు. ఆపై నిరంజన్ మెడికల్ ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సాయాన్ని పవన్ అందజేశారు.
పవన్ కళ్యాణ్ మాట ఇస్తే అది శాసనమే అన్నట్టుగా.. హనుమకొండ పర్యటన ముగిసిన కొద్దిసేపట్లోనే, కేవలం ఒకే ఒక్క గంట వ్యవధిలో నిరంజన్ కోరుకున్న అరుదైన పూడిల్ బ్రీడ్ కుక్కపిల్లను జనసేన బృందం ఆ బాలుడి ఇంటికి చేర్చింది. ఆ బుజ్జి కుక్కపిల్లను చూసి నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుక్కపిల్లతో పాటు, ఒక ట్యాబ్ ను కూడా పంపించడం విశేషం.
అలాగే, నిరంజన్ తల్లిదండ్రులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పనిచేశారని తెలుసుకుని, వారి శాశ్వత జీవనోపాధి కోసం సొంతంగా ఒక క్యాంటిన్ ఏర్పాటు చేయించాలని తెలంగాణ జనసేన నేతలను పవన్ ఆదేశించారు. "నీకు ఇల్లు కూడా కట్టిస్తాను" అంటూ పవన్ ఇచ్చిన అదనపు హామీ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అభిమాని చివరి కోరికను వెనువెంటనే తీర్చిన పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
https://x.com/JanaSenaParty/status/2067247561728233973
![]() |
![]() |