![]() |
![]() |

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన ప్రముఖ నటి చైత్రా రెడ్డి (Chaitra Reddy) వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కాయల్' సీరియల్ ద్వారా అశేష ప్రజాదరణ పొందిన చైత్రా రెడ్డి, తన భర్త రాకేష్ సమలతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయని, త్వరలోనే వీరు చట్టబద్ధంగా విడిపోవడానికి సిద్ధమవుతున్నారని తమిళ, తెలుగు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
చైత్రా రెడ్డికి బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది. కన్నడ ఇండస్ట్రీతో తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, తెలుగులో 'ఎవరే నువ్వు మోహిని' వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అయి అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అజిత్ కుమార్ నటించిన 'వలిమై' చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించి వెండితెరపై కూడా తన మార్క్ చూపించింది. మహేష్ బాబుతో కలిసి ఒక యాడ్ లో కూడా నటించింది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ, వందల ఎపిసోడ్‌ల సీరియల్స్ లీడ్ రోల్స్ పోషిస్తూ దూసుకుపోతున్న తరుణంలో ఈమె వ్యక్తిగత జీవితం గురించిన వార్త రావడం అభిమానులను కలవరపెడుతోంది.

సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అయిన రాకేష్ సమలను చైత్రా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన క్యూట్ ఫోటోలు, ట్రావెల్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేవి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య హఠాత్తుగా ఎలాంటి విభేదాలు వచ్చాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి ఎలాంటి ఫోటోలను కానీ, అప్‌డేట్స్‌ను కానీ సోషల్ మీడియా వేదికలపై పంచుకోకపోగా.. గతంలో దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది.
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్‌లో ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, చైత్రా రెడ్డి లాంటి క్రేజ్ ఉన్న నటి గురించి కావడంతో కోలీవుడ్ మరియు టాలీవుడ్ వర్గాల్లో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ విడాకుల ప్రచారంపై ఇప్పటివరకు అటు చైత్రా రెడ్డి కానీ, ఇటు రాకేష్ సమల కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం నెటిజన్లు, కొన్ని వెబ్‌సైట్లు సృష్టిస్తున్న పుకార్లేనా లేక నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారా అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. నటి చైత్రా రెడ్డి స్వయంగా స్పందించి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |