Home  »  News  »  కాజల్ ‘ది ఇండియా స్టోరీ’ పోస్టర్.. ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించే సినిమా!

Updated : Jun 18, 2026

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్ తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం, తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఓ న్యాయవాదిగా, శ్రేయస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రిగా కనిపిస్తున్నారు. అలాగే శ్రేయస్ కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి ద్వారా, లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఒక తీవ్రమైన సమస్య వెనుక ఉన్న మానవీయ కోణాన్ని పోస్టర్ బలంగా ఆవిష్కరించింది.

ముంబై హైకోర్టు నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో, సాక్షుల బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహార కల్తీ అనే అత్యంత కీలకమైన సమస్యపై సాగే కోర్ట్‌రూమ్ డ్రామాకు ఇది సంకేతంగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి చెట్టన్ డీకే దర్శకత్వం వహించగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మిస్తున్నారు. జూలై 24, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

భారతదేశంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన, తరచూ నిర్లక్ష్యానికి గురయ్యే ఆహార కల్తీ సమస్య ఈ చిత్ర ప్రధానాంశం. సాధారణ ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఆహార పదార్థాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సమాజంలో అవగాహన పెంచే ప్రయత్నం చేయనుంది.

దర్శకుడు చెట్టన్ డీకే మాట్లాడుతూ, “ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, కావాల్సిన వారిని కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ‘ది ఇండియా స్టోరీ’. మన సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నప్పటికీ అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. ఇది మనందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశం. ఈ సినిమా ద్వారా ఈ దాగి ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు, దీనిపై ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలకాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ చిత్రంలో ఉన్న బలమైన సందేశం ప్రతి ఒక్కరికీ కళ్లు తెరిపించేలా ఉంటుందని, అలాగే ప్రతిరోజూ తాము తీసుకునే ఆహారం విషయంలో మరింత అవగాహనతో ఉండేలా ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను”

ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని నిశాంత్ భాగవత్, సంగీతాన్ని మంగేష్ ధాక్డే, ఎడిటింగ్‌ను ఆశిష్ మ్హాత్రే, సాహిత్యాన్ని షకీల్ అజామీ, సౌండ్ డిజైన్‌ను అన్మోల్ భావే అందిస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.