![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో టన్నుల కొద్దీ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కేరళలోఉన్న ఫ్యాన్ బేస్ ఒక ప్రత్యేకమైన రికార్డ్ అనే చెప్పాలి. మలయాళ ప్రేక్షకులు అల్లు అర్జున్ ని టాలీవుడ్ హీరోగా కాకుండా, తమ సొంత మాలీవుడ్ స్టార్‌లా భావిస్తూ 'మల్లు అర్జున్' అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన 'ఆర్య', 'హ్యాపీ', 'బన్నీ', 'దేశముదురు' వంటి చిత్రాల మలయాళ వెర్షన్లతోనే అల్లు అర్జున్ కేరళలో ఒక భారీ సెన్సేషన్‌గా మారారు. తాజాగా కేరళలో 4K టెక్నాలజీతో, అధునాతన సౌండ్ మరియు కలర్ గ్రేడింగ్‌తో దాదాపు ఒక కోటి రూపాయల ఖర్చుతో సరికొత్త హంగులతో 'హ్యాపీ' మూవీ రీ రిలీజ్ అయింది. (మలయాళంలో 'హ్యాపీ బీ హ్యాపీ') సదరు చిత్రం అక్కడ సృష్టించిన ప్రభంజనం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి.
కేరళ వ్యాప్తంగా జూన్ 11న విడుదలైన ఈ రీ-రిలీజ్ వెర్షన్ మొదటి రోజే ఏకంగా 27 లక్షల నుండి 30 లక్షల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేరళలో కేవలం ట్రాక్ చేయబడిన షోల ద్వారానే ఈ చిత్రం మొదటి రోజు 20.84 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాది 2026లో కేరళలో విడుదలైన పలు అగ్ర హీరోల కొత్త తెలుగు చిత్రాల ఓపెనింగ్స్ రికార్డులను కూడా ఈ పాత సినిమా అధిగమించడం విశేషం. ఉదాహరణకు ఈ ఏడాది కేరళలో విడుదలైన రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం మొదటి రోజు కేవలం 20 లక్షల రూపాయలు, అలాగే ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' చిత్రం 19 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగా, 'హ్యాపీ' ఈ రెండు భారీ చిత్రాల డే 1 వసూళ్లని సునాయాసంగా దాటేసి 2026లో కేరళలో హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.
Also read: Chiranjeevi: చిరంజీవిపై సమంత భర్త వ్యాఖ్యలు వైరల్.. ఆ విధంగా జరిగి ఉంటే ఎలా ఉండేదో!
కేరళలోని కోజికోడ్, కొచ్చి, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాల్లోని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుంచే యువత హోరెత్తించారు. థియేటర్లు అన్నీ పెళ్లి పందిళ్లను తలపిస్తూ పండుగ వాతావరణం కనిపించింది. అల్లు అర్జున్ మార్క్ కామిక్ టైమింగ్, మేనరిజమ్స్, ఎనర్జిటిక్ డ్యాన్సులకి మలయాళ ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్ల ముందు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. మలయాళ ప్రముఖ నటి అనాస్వరా రాజన్ సైతం తన స్నేహితులతో కలిసి థియేటర్లో ఈ సినిమా చూస్తూ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ క్రేజ్ కేవలం 'పుష్ప' సినిమా వల్ల మాత్రమే రాలేదని, రెండు దశాబ్దాలుగా కేరళ ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయిన సుస్థిర అభిమాన సామ్రాజ్యం అని ఈ 'హ్యాపీ' రీ రిలీజ్ కలెక్షన్స్ మరోసారి నిరూపించాయి. ఒక పరభాషా నటుడి పాత డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ అయితే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు.
![]() |
![]() |