![]() |
![]() |
ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లోని అడుగడుగునా ఎదురయ్యే అవమానాలు, సమాజం చూపే వివక్షను కళ్లకు కట్టే కథాంశంతో వస్తున్న సరికొత్త చిత్రం 'LGBT ఏ లీగల్ బ్యాటిల్'. ప్రముఖ దర్శకుడు పి. సునీల్ కుమార్ తెరకెక్కించిన ఈ కోర్ట్ డ్రామా మూవీ జూన్ 19న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన ట్రాన్స్‌జెండర్ హిమ రాథోడ్.. తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో పడిన కష్టాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
వరంగల్ సమీపంలోని హన్మకొండకు చెందిన హిమ రాథోడ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులో అబ్బాయిగానే ఉన్నప్పటికీ, 15 ఏళ్లు వచ్చేసరికి శరీరంలో వచ్చిన హార్మోన్ల మార్పుల వల్ల ఎన్నో మానసిక సంఘర్షణలను అనుభవించానని ఆమె తెలిపారు. తోటి పిల్లల వెక్కిరింతలు, పాఠశాలలో వాష్‌రూమ్‌కి వెళ్లడానికి కూడా భయపడాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు.
తమ కుటుంబానికి ఈ విషయం చెప్పినప్పుడు ఇంట్లో తీవ్ర నిరసన వ్యతిరేకత ఎదురైందని, చివరికి 'ఎలాగైనా బతుకు' అంటూ తనను ఇల్లు వదిలి పొమ్మన్నారని హిమ కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా హైదరాబాద్ చేరిన తనకు, సమాజంలో మనుగడ సాగించడం పెద్ద సవాలుగా మారింది. సర్జరీ ఖర్చుల కోసం దాదాపు రెండేళ్ల పాటు నగర రోడ్లపై భిక్షాటన చేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సర్జరీ సమయంలో అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదని వివరించారు.
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సున్నితమైన అంశాలపై చిత్రాలు రావడం అరుదు. 'LGBT ఏ లీగల్ బ్యాటిల్' చిత్రం ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడే ఒక వినూత్నమైన కథాంశంతో రూపొందింది. దర్శకుడు సునీల్ కుమార్ గారు ఎంతో బాధ్యతాయుతంగా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేశారని, హిమ రాథోడ్ లాంటి రియల్ లైఫ్ వ్యక్తులను సినిమాలో భాగం చేయడం వల్ల ఈ కథకు మరింత సహజత్వం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
హిమ రాథోడ్ పంచుకున్న ఈ కన్నీటి గాథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. జూన్ 19న విడుదల కానున్న ఈ కోర్ట్ డ్రామా చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |