![]() |
![]() |
సినిమా అనేది క్రియేటివిటీకి సంబంధించిన ప్రక్రియ. తాము తీసే సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఎన్నో కథలను వింటారు దర్శకనిర్మాతలు. వాటిలో తమకు నచ్చిన కథను ఎంపిక చేసుకొని సినిమా తీసేస్తారు. ఒక్కోసారి అలా కథలు ఎంపిక చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా దొర్లే అవకాశం ఉంటుంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆ కథ తనది అంటూ అసలు రచయిత కోర్టుకెక్కుతారు. ఇలాంటి అనుభవాలు దర్శనిర్మాతలకు ఎన్నోసార్లు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సినిమా రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత కాపీరైట్ కేసులు నమోదవుతాయి.
2011లో రిలీజ్ అయిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రం ఘనవిజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రభాస్ హీరోగా దశరథ్ రూపొందించిన ఈ సినిమా కథ తనది అంటూ ముమ్మిడి శ్యామలారాణి అనే రచయిత్రి కోర్టుకెక్కింది. తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవలను ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాగా తీశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు దశరథ్ సుప్రీమ్ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టం కింద ఈ కేసు నమోదైందని, కాలపరిమితి ముగిసిపోవడం వల్ల ఈ కేసును కొట్టెయ్యాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణకు తాత్కాలికంగా స్టే ఇచ్చింది సుప్రీమ్ కోర్టు. ఇదిలా ఉంటే.. ఈ కేసు వల్ల ఏర్పడిన సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని, లేదంటే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీమ్ కోర్టు ధర్మాసనం.. దిల్‌రాజు తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డిని హెచ్చరించింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మొదట ఈ కేసును దిల్‌రాజు తరఫున కృష్ణదేవ్ వాదించారు. ఈ కేసును హైకోర్టు ఇది వరకే కొట్టేసిందని, సీఆర్‌పీఎస్ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని కేసును కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీమ్ కోర్టు ధర్మాసనం దీనికి భిన్నంగా స్పందిస్తూ మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా 2011లో రిలీజ్ అయింది. శ్యామలారాణి 2017లో కేసు వేశారు. ఈ సినిమా టీవీల్లో ప్రసారమవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరం జరుగుతున్న నేరంగా కనిపిస్తోంది కాబట్టి దీన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అంతేకాదు, ప్రతివాదికి నోటీసులు జారీ చేసి రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది కోర్టు. జస్టిస్ బేబీ పార్థీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రస్తుతానికి ట్రయల్ కోర్టులో విచారణను నిలిపివేసింది. అంతేకాదు, ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్మాత దిల్‌రాజును హెచ్చరించింది ధర్మాసనం.
![]() |
![]() |