![]() |
![]() |
ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చలామణి అవుతున్న హీరోల ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు జరగడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఇప్పటి మాట కాదు.. సినిమా పుట్టిన నాటి నుంచి హీరోల అభిమానుల మధ్య రగడ జరుగుతూనే ఉంది. తెలుగు హీరోల విషయానికి వస్తే.. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తరచూ గొడవలు జరగడం చూశాం. వ్యక్తిగతంగా సోదరుల్లా మెలిగే ఎన్టీఆర్, ఎఎన్నార్ ఈ విషయంలో బాధపడడం, అభిమానుల్ని సముదాయించడం చేశారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగేవి. తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అని వాదోపవాదాలు జోరుగా సాగేవి. అయితే టాలీవుడ్‌లోని అభిమానుల గొడవలు ఒక స్థాయికే పరిమితం అయ్యేవి. కొంతకాలం తర్వాత వాటిని సీరియస్‌గా తీసుకునేవారు కాదు.
తమిళనాడులోని అభిమానులు దానికి పూర్తిగా భిన్నం. అక్కడి హీరోలకు కరడుగట్టిన అభిమానులు ఉంటారు. ఏదైనా తేడా వస్తే తీవ్రస్థాయిలో స్పందిస్తారు. ఈ గొడవల్లో ఒకరినొకరు గాయపరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటివి అక్కడ ఎన్నో జరిగినప్పటికీ తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఎన్నో గొడవలు జరిగాయి. అయితే కొంతకాలంగా అది వ్యక్తిగతానికి చేరుకుంది. తమిళనాడులో సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి ఉన్న స్థానం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన తర్వాతి స్థానం తమ హీరోదే అంటూ అజిత్, విజయ్ ఫ్యాన్స్ తరచూ గొడవపడుతున్నారు. తాజాగా ఓ అంశం ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మరోసారి చిచ్చుపెట్టింది. అదే.. పద్మ అవార్డ్స్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో నందమూరి బాలకృష్ణకు, తమిళ్‌లో అజిత్‌కు, నటి శోభనకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఇది తమిళనాడులోని అధికార పార్టీకి గిట్టడం లేదు. అందుకే విజయ్‌పై అజిత్ పైచేయిగా చూపించాలన్న ఉద్దేశంతో అతనికి పద్మభూషణ్ అవార్డు ఇప్పించారని ప్రచారం జరుగుతోంది. అవార్డుల విషయంలో గతంలో కూడా హీరోల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. ఎం.జి.ఆర్, కమల్‌హాసన్ రాజకీయ పార్టీలు పెట్టిన సందర్భంలోనే శివాజీ గణేశన్‌కు, రజినీకాంత్‌లకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అధికార పార్టీ కావాలనే ఇలా చేసిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అజిత్‌కి పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక కూడా ఇలాంటి కారణమే ఉంటుందని విజయ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఇక అజిత్, విజయ్‌ల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి తగాదాలు ఉన్నాయి అంటే.. అలాంటివేమీ లేవనే అంటారు. కానీ, విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టినపుడు కోలీవుడ్‌లోని మిగతా హీరోలంతా విజయ్‌కి విషెస్ చెప్పారు. కానీ, అజిత్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అలాగే ఇటీవల అజిత్.. దుబాయ్ కార్ రేస్‌లో విజయం సాధించినపుడు సినీ ప్రముఖులు ఎంతో మంది అతనికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ, విజయ్ మాత్రం నోరు విప్పలేదు.
అజిత్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది ఎంతో సముచితం అని అతని అభిమానులు, సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో ఎవరి అండ దండ లేకుండా వచ్చారు అజిత్. తండ్రి వారసత్వం లాంటివి లేకుండా ఎదిగిన నటుడు. అంతేకాదు, కులాల గురించి, మతాల గురించి ఆలోచించని మంచి మనిషి. వ్యక్తిగతంగా ఎంతో క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతున్న అజిత్‌కి షూటింగ్, ఇల్లు, తనకిష్టమైన కార్ రేస్ తప్ప మరో ధ్యాస లేదు. నటనతోపాటు కార్ రేస్‌లో కూడా తన ప్రతిభను చాటుకుంటున్న అజిత్.. పద్మ అవార్డుకు అర్హుడు. తండ్రి వల్లే నటుడిగా మారి, ఆ తర్వాత విజయాలు సాధించి పేరు తెచ్చుకున్న విజయ్.. కులం, మతం అనే రొచ్చులో కొట్టుకుంటున్నాడు. అతనికి, తమ హీరో అజిత్‌కి ఎంతో తేడా ఉందని అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. మరి దీనిపై ఈ ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |