![]() |
![]() |

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'తండేల్'. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే విడుదలకు పది రోజుల ముందే 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తమ సినిమా డిస్టింక్షన్ లో పాస్ అయిందంటూ నిర్మాత బన్నీ వాసు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. (Thandel Movie)
"తండేల్ ఫైనల్ ఎడిట్ ను అల్లు అరవింద్ గారు వీక్షిస్తున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థిలా నేను ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను." అంటూ తండేల్ ఎడిట్ రూమ్ ఎదురుగా తాను కూర్చొని ఉన్న వీడియోను రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు బన్నీ వాసు. అనంతరం మూడు గంటల తర్వాత, "డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు." అంటూ మరో పోస్ట్ పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. బన్నీ వాసు తాజా సోషల్ మీడియా పోస్ట్ ని బట్టి చూస్తే, అల్లు అరవింద్ కి ఈ సినిమా బాగా నచ్చిందని అర్థమవుతోంది.

అల్లు అరవింద్ సీనియర్ నిర్మాత. సినిమాలపై ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. తనకి నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారనే పేరుంది. అలాంటి అరవింద్ 'తండేల్'కి 'డిస్టింక్షన్ లో పాస్' అని సర్టిఫికేట్ ఇచ్చారంటే.. ఈ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్ లో మంచి సక్సెస్ సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగ చైతన్యకు 'తండేల్' విజయం చాలా కీలకం. ఆయన గత రెండు చిత్రాలు 'థాంక్యూ', 'కస్టడీ' నిరాశపరిచాయి. ఈ క్రమంలో 'తండేల్' పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు చైతన్య. అక్కినేని అభిమానులు సైతం చైతన్య కమ్ బ్యాక్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. నాగార్జున హీరోగా సినిమాలు తగ్గించి, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అఖిల్ విషయానికొస్తే, ఇంతవరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేదు. దీంతో చైతన్య సినిమా సక్సెస్ పైనే అభిమానుల దృష్టి అంతా ఉంది.
'తండేల్'పై ప్రస్తుతం పాజిటివ్ వైబే ఉంది. 'లవ్ స్టోరీ' తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా. అలాగే '100% లవ్' తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చైతన్య చేసిన సినిమా. దానికితోడు 'కార్తికేయ-2' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. ప్రచారం చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో 'తండేల్'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి అల్లు అరవింద్ జడ్జిమెంట్ నిజమై చైతన్యకు 'తండేల్' మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |