![]() |
![]() |

కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు. 'పుష్ప-2'ని బాయ్ కాట్ చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు, "ఈమధ్య సినిమాల్లో హీరోలు స్మగ్లర్లగా నటిస్తున్నారు" అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'ని టార్గెట్ చేసినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ఈ వివాదంపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మూవీ 'మత్తు వదలరా-2'. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. నిర్మాత రవిశంకర్ కి పవన్-బన్నీ వివాదానికి సంబంధించిన ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన ఉద్దేశం వేరు. దానిని అనవసరంగా పుష్ప సినిమాకి ఆపాదించారు. అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఆయన, దానిని తక్కువ చేయాలని అసలు అనుకోరు. ఆయన ఏదో అలా ఫ్లోలో మాట్లాడారు. అంతేకాని అసలు ఆయన అలా టార్గెట్ చేసి మాట్లాడే మనిషి కాదు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. అలాగే సినిమా విడుదల సమయంలో అభిమానుల మధ్య కూడా ఎటువంటి దూరం ఉండదు." అని చెప్పుకొచ్చారు.
'పుష్ప-2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల అప్డేట్లను నిర్మాత రవిశంకర్ ఇచ్చారు. "పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న విడుదలవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. సెప్టెంబర్ 2 కి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు. అక్టోబర్ లో సెకండాఫ్ ఇచ్చేస్తారు. నవంబర్ 20 కి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెప్టెంబర్ లో ఒకటి, అక్టోబర్ లో ఒకటి పాటలు విడుదల చేస్తాం. అలాగే డిసెంబర్ 5న ప్రీమియర్లు వేసే ఆలోచన కూడా ఉంది." అన్నారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి మాట్లాడుతూ.. "ఈమధ్య హీరో గారిని కలిశాం. త్వరలోనే మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తాం. జనవరి నాటికి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఒక స్పెషల్ అప్డేట్ ఉంటుంది." అని రవిశంకర్ తెలిపారు.
![]() |
![]() |