![]() |
![]() |
హీరోల అభిమానుల్లో సూపర్‌స్టార్ కృష్ణ అభిమానులకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కృష్ణకు ఆరోజుల్లో వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉండేవి. ఆ తర్వాత కృష్ణ నటవారసుడుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మహేష్‌ని కూడా అదే అభిమానంతో ఆదరించారు కృష్ణ ఫ్యాన్స్. ప్రతి ఏడాది కృష్ణ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా వాడవాడలా జరుపుకునేవారు. ఇప్పుడు అదే ఆనవాయితీని ఆయన నటవారసుడికి కొనసాగిస్తున్నారు అభిమానులు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజును రెండు తెలుగు రాష్ట్రాల్లోని సూపర్‌స్టార్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి బర్త్‌డే విషెస్‌ను వేలాదిగా పంపించారు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లోని ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా రష్మిక మందన్న ఎంతో ప్రేమతో మహేష్‌కి చెప్పిన బర్త్‌డే విషెస్ బాగా వైరల్ అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో తన పుట్టినరోజును ఘనంగా జరిపిన అభిమానులు, సోషల్ మీడియాలో తనకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు మహేష్. ‘మీరు చూపిన ప్రేమ, పంపిన సందేశాలు, ఆశీస్సులకు నేను ఎంతో సంతోషించాను. నా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. ఎల్లవేళలా నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు, మీరు ఇస్తున్న సపోర్ట్‌కు నా ధన్యవాదాలు. లవ్ యూ ఆల్’ అంటూ ట్వీట్ చేశారు సూపర్‌స్టార్. మహేష్ చేసిన ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అభిమానులు.
ఇక మహేష్‌బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ కమిట్ అయిన సినిమా ఒక్కటే. అదే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న రాజమౌళి సినిమా. మరో రెండు, మూడు సంవత్సరాల పాటు రాజమౌళి కాంపౌండ్‌లోనే ఉండే మహేష్ ఈ పాన్ ఇండియా సినిమా కోసం అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన లుక్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు రాజమౌళి. ఆయన ఊహకు తగినట్టుగా తనని తాను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు మహేష్. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఎడ్వంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని కూడా రంగంలోకి దింపుతున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
![]() |
![]() |