![]() |
![]() |
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఏది చేసినా సంచలనమే. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ట్రై చేసే జేమ్స్ ఫిరానా, ఎలియన్స్, ది అబీస్, టెర్మినేటర్ 2, టైటానిక్.. ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేదే.. ఇక అవతార్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ప్రపంచంలో అలాంటి కొత్త ప్రపంచాన్ని ఎవరూ ఆవిష్కరించలేదన్నది వాస్తవం. ప్రేక్షకుల్ని అలాంటి కొత్తలోకంలో విహరింపజేసిన జేమ్స్ అంతటితో ఆగలేదు. తన కాన్సెప్ట్‌కి కొత్త మెరుగులు దిద్దుతూ వరసగా సీక్వెల్స్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి చాలా సీక్వెల్స్ ఉంటాయని పదేళ్ళ క్రితమే ప్రకటించాడు.
దానిలో భాగంగానే అవతార్(ది వే ఆఫ్ వాటర్), అవతార్(ఫై అండ్ యాష్) చిత్రాలను 2017లో ఒకేసారి షూటింగ్ స్టార్ట్ చేసి 2020కి పూర్తి చేశాడు. అయితే ఇలాంటి సినిమాలు టోటల్‌గా విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటిని కంప్లీట్ చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. షూటింగ్ పూర్తయిన రెండు సంవత్సరాల తర్వాత 2022లో అవతార్(ది వే ఆఫ్ వాటర్) చిత్రాన్ని రిలీజ్ చేశాడు. మూడో భాగం అవతార్(ఫైర్ అండ్ యాష్) చిత్రాన్ని 2024 డిసెంబర్ రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో 2025 డిసెంబర్ 19న మూడో పార్ట్‌ను రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు జేమ్స్ కేమరాన్.
ది వే ఆఫ్ వాటర్ పేరుతో 2022లో వచ్చిన అవతార్ 2 చిత్రం సముద్ర గర్భంలోని అద్భుతమైన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. మొదటి భాగంలో కథ పండోరా గ్రహంలో, భూమి మీద జరిగితే, రెండో భాగం కథ నీళ్ళల్లో జరిగింది. ఇప్పుడు అవతార్ 3 అగ్ని నేపథ్యంలో సాగుతుంది. పండోరా గ్రహంలోని మరో ప్రాంతంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో కొత్త తెగలు, కొత్త సంస్కృతి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మరోసారి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు జేమ్స్ కేమరాన్ సిద్ధమవుతున్నారు. మూడో భాగం రిలీజ్ అయిన తర్వాత అవతార్ 4ను స్టార్ట్ చేస్తారు. 2029 డిసెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
![]() |
![]() |