![]() |
![]() |
నటరత్న ఎన్.టి.రామారావును అభిమానించని వారు, ఇష్టపడనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ మహానటుడి జీవితం అందరికీ ఆదర్శమే. సినిమా రంగంలో ఎంతో మందికి ఆయన దైవసమానులు. అలాంటి వారిలో దర్శకుడు వై.వి.యస్.చౌదరి ఒకరు. తన ప్రతి సినిమా ప్రారంభంలోనూ ఎన్టీఆర్‌ను శ్లాఘిస్తూ ఓ ఫోటోను చూపిస్తారు చౌదరి. నందమూరి కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది. హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు చేయడం ద్వారా తన అభిమానాన్ని మరింత చాటుకున్నారు. వైవియస్‌కి కొత్తవారిని పరిచయం చేయడం అనేది మొదటి నుంచీ అలవాటు. ఇప్పటికే ఇండస్ట్రీకి రామ్, ఇలియానా వంటి స్టార్స్‌ను పరిచయం చేశారు.
తాజాగా ఎన్.టి.ఆర్.(న్యూ టాలెంట్ రోర్స్) అనే బేనర్‌పై ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్.టి.రామారావుగారికి ఇష్టమైన మనవడు ఎన్టీఆర్ కదా? అనే ప్రశ్న ఎదురైంది. దానిపై వై.వి.యస్.చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘రామారావుగారు తనకు ఇష్టమైన మనవడు ఎవరు అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయనకు అందరూ సమానమే. అలాగే మనవడు ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని ఎక్కడా మాట్లాడలేదు’ అని సమాధానమిచ్చారు. మొదటిసారి మనవడ్ని చూసిన రామారావుగారు.. అంతకుముందు తారక్‌రామ్‌గా పిలవబడే మనవడికి తన పేరు పెట్టమని హరికృష్ణకు సూచించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. అంతేకాదు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా ఒక వేదికపై ఇదే విషయం గురించి చెబుతూ ‘తారక్‌రామ్‌కి తారకరామారావు అని నా పేరు పెట్టండి’ అని సూచించారు’ అంటూ తండ్రితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు హరికృష్ణ. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ ప్రస్తావన అనేది ఎందుకు వచ్చిందో తెలీదుగానీ, వైవియస్ చౌదరి చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి.
![]() |
![]() |