![]() |
![]() |
ఒక సినిమాను నిర్మించి దాన్ని రిలీజ్ చేసి, తద్వారా డబ్బు సంపాదించడం అనేది ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా, సినిమా మేకింగ్ ఎంత సులువుగా మారినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను పూర్తి చేసి రిలీజ్ చెయ్యాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా ఒకనెల, రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసే అవకాశం లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తే వెంటనే నెట్‌లో ఆ సినిమా ప్రత్యక్షమవుతోంది. అప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుంది. అలా సినిమా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులు కరువైపోయారు. ఒక్కరి వల్ల సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలందరూ నష్టపోతున్నారు.
సినిమా ఇండస్ట్రీ పైరసీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఒక వెబ్‌సైట్‌లో సినిమా వచ్చేయడం అందరికీ పెద్ద సమస్యగా మారింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సైట్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నవారిలో నెంబర్‌వన్ అని చెప్పాలి. ఈ వెబ్‌సైట్ అడ్మిన్‌ని పట్టుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఫలితం కనిపించలేదు. దాన్ని అలుసుగా తీసుకొని తమిళ్ రాకర్స్ ఫలానా సినిమాను పైరసీ చెయ్యబోతున్నాను అని ప్రకటించి మరీ సైట్‌లో పెట్టేవారు. ఇది ఒక సంచలనంగా మారింది. తమిళ్ రాకర్స్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌నే రూపొందించారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా తమిళ్ రాకర్స్ ఆట కట్టించారు పోలీసులు. దాని అడ్మిన్ అయిన జెఫ్ స్టీఫెన్ రాజ్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన ధనుష్ సినిమా ‘రాయన్’ను తిరువనంతపురంలోని ఒక థియేటర్‌లో మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ భార్య ప్రమేయం ఉంది. ఎలాగంటే.. పృథ్విరాజ్ హీరోగా నటించిన ‘గురువాయూర్ అంబలనడయిల్’ అనే సినిమా రిలీజ్ రోజే పైరసీ చేసి తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో పృథ్విరాజ్ భార్య సుప్రియ మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో స్టీఫెన్‌ను అరెస్ట్ చేశారు. ఇది అన్ని సినిమా ఇండస్ట్రీలకు, నిర్మాతలకు శుభవార్త అనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని, తమిళ్ రాకర్స్ అడ్మిన్‌ని అరెస్ట్ చేయడం తమకెంతో ఊరట కలిగిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.
![]() |
![]() |