![]() |
![]() |

'అంతఃపురం' చిత్రంలో 'అసలేం గుర్తుకురాదు' పాట వినే ఉంటారు. అప్పట్లో చాలా పెద్ద హిట్. ఆడియో పరంగానూ, విజువల్ గానూ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ పాటలో సౌందర్య చీర రంగులు మారడం భలే ఉంటుంది. అయితే ఆ ఐడియా ఆ చిత్ర దర్శకుడికో, ఎడిటర్ కో వచ్చి అనుకుంటే పొరపాటే. అది అసలు తమ మూవీ టీంకి వచ్చిన ఆలోచనే కాదని చెప్పి దర్శకుడు కృష్ణవంశీ సర్ ప్రైజ్ చేశారు.
ఈ మధ్య కృష్ణవంశీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. నెటిజన్లతో సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. "అంతఃపురం సినిమాలో 'అసలేం గుర్తుకురాదు' పాట లో సౌందర్య గారి చీర రంగులు మారడం భలే అనిపించింది, కొత్తగా ఉంది అప్పట్లో. ఆ ఐడియా ఎలా వచ్చింది సార్.." అని అడుగగా.. "అది సినిమాలో లేదు.. విడుదల తర్వాత జెమిని టీవీలో ఎడిటర్ చేశాడు." అని రిప్లై ఇచ్చారు కృష్ణవంశీ. దీంతో అందరూ షాకవుతున్నారు. ఒక టీవీ ఛానల్ ఎడిటర్ అంత క్రియేటివ్ గా ఆలోచించాడా అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో, ఒకరి క్రెడిట్ కొట్టేయకుండా ఇలా జెన్యూన్ గా చెప్పిన కృష్ణవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అంతఃపురం'. 1998 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
![]() |
![]() |