![]() |
![]() |
తన కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని డైరెక్టర్ ఇండియాలో ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇప్పటివరకు అతను చేసిన 12 సినిమాలూ సూపర్‌హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అంటే తెలియని సినిమా ప్రేమికులు లేరు అన్నంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి ఓ టాప్ డైరెక్టర్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం అంటే ఎంత గొప్ప విషయం.. రాజమౌళి ఆఫర్ ఇస్తే ఎగిరి గంతేసి ఒప్పుకునే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఉన్నారు. కానీ, ఒక హీరోయిన్ మాత్రం రాజమౌళి ఆఫర్ తిరస్కరించింది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. త్రిష.
ఇది 2010లో మాట. అప్పటికి త్రిష స్టార్ హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉంది. ఇక రాజమౌళి అప్పటికే 7 సూపర్‌హిట్ సినిమాలు చేసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ‘మగధీర’తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాజమౌళి ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో సునీల్‌తో ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు. కమెడియన్ సునీల్ హీరోగా సినిమా ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరితో సినిమా చేసినా సూపర్‌హిట్ చెయ్యగల సత్తా ఉన్న రాజమౌళి ‘మర్యాద రామన్న’ చిత్రానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాలో నటించే అద్భుతమైన అవకాశాన్ని త్రిషకు ఇచ్చాడు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది త్రిష.
దానికి ఆమె చెప్పిన కారణం ఏమిటంటే.. అప్పటికే తను టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉంది. పైగా తను నటించిన చాలా సినిమాల్లో సునీల్ కమెడియన్‌గా నటించాడు. అతని పక్కన తను హీరోయిన్‌గా నటించడమేమిటి అనుకుంది త్రిష. అలా ‘మర్యాద రామన్న’ చిత్రంలో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అప్పుడా అవకాశం సలోనికి దక్కింది. ఈ సినిమాతో సలోనికి హీరోయిన్‌గా మంచి బ్రేక్ వస్తుందనుకున్నారు. కానీ, ఈ సినిమా కమర్షియల్‌గా మంచి హిట్ సాధించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. రెండు, మూడు సినిమాల్లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు.
![]() |
![]() |