![]() |
![]() |
కొరియోగ్రాఫర్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ‘మాస్’ చిత్రంతో డైరెక్టర్‌గా టర్న్ అయిన లారెన్స్‌కి ఒక మార్క్‌ని క్రియేట్ చేసిన సినిమా ‘కాంచన’ సిరీస్. మొదటి భాగాన్ని ‘ముని’ పేరుతో రూపొందించి ముని2 గా ‘కాంచన’ చిత్రాన్ని, కాంచన2గా ‘గంగ’ చిత్రాన్ని రూపొందించి ఆ తర్వాత ‘కాంచన3’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు లారెన్స్. ‘ముని’ తప్ప మిగతా సినిమాలను లారెన్స్ సొంతంగా నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు. హారర్ కామెడీతో సరికొత్తగా రూపొందిన ఈ సిరీస్ తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ‘కాంచన3’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘కాంచన4’పై దృష్టి పెట్టాడు లారెన్స్.
‘చంద్రముఖి’ తమిళ్, తెలుగు భాషల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘చంద్రముఖి2’ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను లారెన్స్ అప్పగించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు ‘కాంచన4’ను ఎట్టి పరిస్థితుల్లో సూపర్‌హిట్ చెయ్యాలనే పట్టుదలతో లారెన్స్ ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. వరసగా రెండు హిట్ సినిమాలతో అలరించిన మృణాల్ ఠాకూర్‌ని హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీస్టార్’ చిత్రంతో మృణాల్ హ్యాట్రిక్ కొడుతుందని అందరూ భావించారు. కానీ, ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ‘కాంచన4’లో నటించే ఛాన్స్ రావడంతో మరో ఘనవిజయాన్ని అందుకుంటానన్న కాన్ఫిడెన్స్‌తో ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |