![]() |
![]() |
.webp)
వారసత్వం అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ చలన చిత్ర రంగంలో వారసత్వానికి ఆద్యుడుగా చెప్పదగిన నటుడు పృథ్విరాజ్ కపూర్. ఆయన వారసుడు రాజ్‌కపూర్ దాన్ని కొనసాగించారు. తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం అనేది ఎన్టీఆర్ కుటుంబంలో మొదలైంది. ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణ హీరోగా విజయకేతనం ఎగురవేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జూన్ 10న 64వ పుట్టినరోజు జరుపుకోనున్నారు బాలకృష్ణ. అంతేకాదు నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్ళు పూర్తవుతోంది. అయితే ఇప్పటికీ టాలీవుడ్‌లో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతూ బ్లాక్‌బస్టర్ మూవీస్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. హీరోగా ఆయన చేసిన సినిమాలు ఎన్ని రికార్డులు నెలకొల్పాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాతమ్మకల చిత్రం మొదలుకొని దాదాపు పదేళ్ళపాటు తండ్రి ఎన్.టి.రామారావుతో కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు-కొంటె కృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి అనుభవం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లోనే ఎక్కువగా నటించడం వల్ల నటనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మంచి పట్టు సాధించారు. ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి వంటి సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. వరస పరాజయాలు రావడంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు బాలయ్య. హీరోగా నిలబడడం కష్టమని అందరూ భావించారు. అవన్నీ పట్టించుకోకుండా తన నాలుగో సినిమా ‘మంగమ్మగారి మనవడు’పై దృష్టిపెట్టారు. ఆ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్‌లో విజయకేతనం ఎగుర వేశారు బాలయ్య.
‘మంగమ్మగారి మనవడు’ చిత్రంతో ప్రారంభమైన బాలకృష్ణ దూకుడు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో పరాజయాలు ఎదురైనా వాటిని ఎంతో సమర్థవంతంగా తట్టుకొని ఘనవిజయాలు సాధించే దిశగా అడుగులు వేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాల్లోనే ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ.
తన సమకాలీనుల్లో జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించగల సత్తా ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. నటవారసుల్లో బాలయ్య స్థాయి సక్సెస్ రేట్ మరెవరికీ లేదనే చెప్పాలి. తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ తరువాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగానూ బాలయ్య చరిత్ర సృష్టించారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా, వాటిలో మంగమ్మగారి మనవడు, లెజెండ్ చిత్రాలు ప్లాటినమ్ జూబ్లీ జరుపుకున్నాయి. ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా 565 రోజులు ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా మంగమ్మగారి మనవడు నిలిచింది. దక్షిణాదిన 1116 రోజులు ఆడిన ఏకైక చిత్రంగా లెజెండ్ చరిత్ర సృష్టించింది.
తెలుగు తెరకు ఎంతో మంది హీరోలు పరిచయమవుతున్నారు, ఘనవిజయాలు సాధిస్తున్నారు. అయినా బాలకృష్ణ ఛరిష్మా ఇంకా తగ్గలేదు. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్న బాలయ్య సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో మెమరబుల్ హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా కోసం పనిచేస్తున్నారు బాలయ్య. ఈమధ్యకాలంలో తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్న బాలయ్య 109వ చిత్రం కూడా అదేస్థాయిలో ఉండేలా కేర్ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి కాంబినేషన్‌లో ‘అఖండ2’ చిత్రం చేయబోతున్నారు బాలయ్య. తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛన ప్రాయంగా ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే 109వ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇవ్వనున్నారు. ఈ రెండు సినిమాలతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న నటసింహ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
![]() |
![]() |