![]() |
![]() |
నటి హేమ పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోందనేది జరిగే పరిణామాలను బట్టి అర్థమవుతోంది. మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అనంతరం జరిగిన విషయాలు అందరికీ తెలిసినవే. ఈ కేసు నుంచి తప్పించుకోవాలని గట్టి ప్రయత్నం చేసిన హేమను చివరికి దోషిగా పరిగణించారు బెంగళూరు పోలీసులు. ఇలాంటి వారి వల్ల తమకు అప్రతిష్ట వాటిల్లుతోందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని సభ్యులు కొన్ని రోజులు వాపోతున్నారు. ఈ ఘటనతో అసోషియేషన్ నుంచి హేమ సస్పెండ్ అవుతుందని కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఈరోజు ‘మా’ అధికారికంగా హేమను సస్పెండ్ చేస్తూ ఆమెకు లేఖ పంపింది. ఆ లేఖలో సారాంశం ఇలా ఉంది..
‘ఇటీవల రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ తీసుకున్నారని మీపై ఆరోపణలు వచ్చాయి. అయితే అవి నిజమేనని టెస్టుల్లో తేలింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు మాకు అందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని సభ్యులందరికీ ఓ నియమావళి ఉంది. దానికి కట్టుబడే అందరూ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనల వల్ల అసోసియేషన్ సమగ్రత దెబ్బతినకుండా తదుపరి నోటీసు వచ్చేవరకు మీ ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. కొనసాగుతున్న విచారణ రిజల్ట్ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
![]() |
![]() |