![]() |
![]() |
ఒక సినిమాకి సంబంధించి హీరో నుంచి క్యారెక్టరన ఆర్టిస్టుల వరకు, డైరెక్టర్ నుంచి లైట్ బోయ్ వరకు అందరూ సఖ్యతగా ఉంటేనే షూటింగ్ సజావుగా సాగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్టిస్టుల మధ్య, టెక్నీషియన్స్ మధ్య అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. అయితే అవి ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా సమసిపోతాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఆ వివాదాలు అసోసియేషన్ వరకు, ఫెడరేషన్ వరకు వెళతాయి. అలాంటి వివాదం ఓ సినిమాకి సంబంధించి జరుగుతోంది. ఆ సినిమా పేరు ‘రక్షణ’. జూన్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రధాన పాత్ర పోషించిన పాయల్ రాజ్‌పుత్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు.
విషయం ఏమిటంటే ఈ సినిమా మేకర్స్ పాయల్ కొన్ని ఆరోపణలు చేసింది. తనను సంప్రదించకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని, ప్రచారానికి ఎందుకు రావంటూ అసభ్యంగా తనని దూషించారని పాయల్ ఆరోపించింది. దానిపై స్పందించిన దర్శకనిర్మాత ప్రణదీప్ ఠాకూర్ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. అది ‘మా’ వరకు వెళ్ళింది.. అటు తర్వాత ముంబాయిలోని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వరకు వెళ్లింది. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళ వరకు మేకర్స్‌గానీ, పాయల్‌గానీ స్పందించలేదు. వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో పాయల్ హైదరాబాద్ వచ్చి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పటివరకు పాయల్ ఒక్క ఈవెంట్‌లో కూడా పాల్గొనకపోవడం గమనార్హం. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హీరోయిన్ ప్రమోషన్స్‌కి రాకపోవడం వల్ల ఆ సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందో అందరికీ తెలిసిందే. ఎలాంటి వివాదమైనా సినిమా రిలీజ్‌కి వచ్చేసరికి ఓ కొలిక్కి వస్తుంది. కానీ, పాయల్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటూ భీష్మించుకు కూర్చుంది. దాని ఫలితంగా హీరోయిన్ లేకుండానే పబ్లిసిటీ చేసి సినిమాని రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్.
![]() |
![]() |