
వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశంలో మొగిలయ్య దంపతులు ఆలపించిన పాట అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది. జానపద కళాకారుడైన మొగిలయ్య గతంలో ఓసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయన వైద్యం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు మరోసారి మొగిలయ్య ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నారు మొగిలయ్య.
దుగ్గొండికి చెందిన మొగిలయ్య(67) వైద్యం నిమిత్తం ఆర్థిక సాయం కోసం అర్థిస్తున్నారు ఆయన సతీమణి కొమురమ్మ. తన భర్త ప్రాణాలు కాపాడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.