![]() |
![]() |
ఒక కొత్త మనిషి కుటుంబంలోకి వస్తే ఆ ఇంట జరిగే శుభాశుభాల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇంటికి కొత్త కోడలు వచ్చిన తర్వాత అన్నీ శుభాలే జరుగుతున్నాయని కొందరంటే, ఆడపిల్ల పుట్టిన వేళా విశేషం వల్ల తమ కుటుంబానికి ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయాయి అని మరికొందరు అంటారు. ఇలాంటివి మన సంస్కృతిలో సర్వ సాధారణమైన విషయాలు. ఇంట్లో ఏర్పడే శుభ పరిణామాలకు కారణాలు ఏవైనా ఫలానా వ్యక్తి వల్లే శుభం జరిగిందని అనుకోవడం మన కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్నదే. అలాంటి ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు మెగా అభిమానులు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.
మెగా ఫ్యామిలీలో క్లింకార అడుగు పెట్టడంతో ఆ ఫ్యామిలీ కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో విజయాలు సాధిస్తోందనేది కొత్తగా వినిపిస్తున్న మాట. రామ్‌చరణ్, ఉపాసనల కుమార్తె క్లింకార పుట్టిన శుభ తరుణం అందరికీ కలిసి వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్.. ఇలా ఎవరికి వారు విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవతోపాటు ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలు, ఆపత్కాల సమయంలో ప్రజలను ఆదుకున్న తీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
క్లింకార పుట్టిన తర్వాత రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారం దక్కింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ఘనవిజయం సాధించడంతో క్లింకార సెంటిమెంట్‌కి మరింత బలం చేకూరింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ శుభ పరిణామాలకు ఇప్పుడు సెంటర్ పాయింట్‌గా నిలిచింది క్లింకార. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ అభిప్రాయాలు ఎలా ఉన్నా.. మెగా అభిమానులు మాత్రం క్లింకార రాక వల్లే మెగా ఫ్యామిలీ ఘనవిజయాలు సాధిస్తోందని గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఘనవిజయం అన్నింటికంటే పెద్ద విజయంగా భావిస్తున్నారు అభిమానులు.
![]() |
![]() |