![]() |
![]() |
‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ఆ చిత్రాన్ని మించే రీతిలో ‘పుష్ప2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్ కృషి చేస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరిగే 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే బన్ని జర్మనీ బయలుదేరారు. ఈ చిత్రోత్సవంలో భారతీయ సినీ ప్రాముఖ్యత, చరిత్ర గురించి అల్లు అర్జున్ ఉపన్యసిస్తారు. అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ‘పుష్ప’ చిత్రాన్ని ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సినీ ప్రముఖులను బన్ని కలుసుకుంటారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బయల్దేరుతూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఒక టాలీవుడ్ హీరోకు ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందడం తెలుగువారు ఎంతో గర్వించదగిన విషయమని ప్రేక్షకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |