![]() |
![]() |
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. హీరో, డైరెక్టర్ కాంబినేషన్ కావచ్చు, హీరో, హీరోయిన్ కాంబినేషన్ కావచ్చు. వరసగా రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే వారిని లక్కీ పెయిర్ అంటుంటారు. ఇలాంటి సెంటిమెంట్ ప్రమోషన్స్‌లో కూడా ఉంది. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి ఎవరినైనా గెస్ట్‌గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. సీనియర్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ సినిమా ఫంక్షన్‌కి హాజరై ఆశీర్వదిస్తే తమ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం చాలా మంది హీరోల్లో, డైరెక్టర్స్‌లో ఉంది. ఆ సెంటిమెంట్‌తోనే సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఈవెంట్‌ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే..
గతంలో అంటే ఇరవై ఏళ్ళ కిందటి నుంచే చిరంజీవి ఏ సినిమాకైనా క్లాప్ కొడితే ఆ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌గా బాగా ఉండేది. అప్పట్లో సోషల్ మీడియా అంతగా విస్తరించలేదు. అయినా అడపా దడపా కొన్ని పేపర్లలోనో, వెబ్‌సైట్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. కొంతమంది ఈ సెంటిమెంట్స్ ఏవీ పట్టించుకోకుండా చిరంజీవితోనే క్లాప్ కొట్టించేవారు. అందరూ అనుకున్నట్టుగానే ఆ సినిమాని విజయం వరించేది కాదు. దాంతో అదో సెంటిమెంట్‌గా మారిపోయింది. చిరంజీవి ఒక్కరే కాదు, అలా మరి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఇదంతా ఓ నమ్మకమే తప్ప సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ప్రారంభించినా సూపర్‌హిట్ అవుతుంది. ఇన్నాళ్ళూ తన హ్యాండ్ మంచిది కాదని, తను ఏదైనా ఈవెంట్‌కి వస్తే ఆ సినిమా ఫలితం గల్లంతవుతుందని ప్రచారం చేసిన వారందరికీ ‘హనుమాన్’తో గట్టి సమాధానం చెప్పారు చిరంజీవి. స్వతహాగా హనుమంతుడికి పరమభక్తుడైన మెగాస్టార్.. ‘హనుమాన్’ చిత్రానికి గట్టి మద్దతు ఇవ్వడమే కాకుండా సినిమా ప్రమోషన్స్‌లో తనవంతు సాయం అందించారు. ఇప్పుడా సినిమా టాలీవుడ్ టాప్ హీరోలను సైతం పక్కన పెట్టి విజయ పథంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి హ్యాండ్ లక్కీ హ్యాండ్‌గా మారిందని అందరూ చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని ఎంతో మంది సినీ ప్రముఖులు కోరుకున్నారు. తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే చిరంజీవి మాత్రం ప్రత్యక్షంగా ఈవెంట్స్‌లో పాల్గొని దర్శకుడు ప్రశాంత్ వర్మకు, హీరో తేజ సజ్జాకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ సినిమా విజయవంతం కావడానికి చిరంజీవి ఆశీస్సులే కారణమని భావించిన చిత్ర యూనిట్.. ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్ధమవుతోంది. అయితే రెండు రోజుల ముందే చిరుని కలవాలని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ, మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునేందుకు బెంగళూరు వెళ్ళి నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా అపాయింట్‌మెంట్ తీసుకొని వీలైనంత త్వరగా మెగాస్టార్‌ని కలిసి తమ విజయానందాన్ని ఆయనతో పంచుకోవాలని చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది.
![]() |
![]() |