![]() |
![]() |

ఈ జనరేషన్ లో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన సినిమానే 'అరుంధతి'. అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ ఫాంటసీ ఫిల్మ్.. స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. తెలుగు సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా 'అరుంధతి' చిత్రం.. అనుష్కను లేడీ సూపర్ స్టార్ ని చేసింది.
అప్పటివరకు గ్లామర్ రోల్స్ కి పరిమితమవుతూ వచ్చిన అనుష్కలోని అభినయ సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్ ను టర్న్ చేసిన చిత్రం 'అరుంధతి'. ఈ సినిమాలో అనుష్క నటవిశ్వరూపం చూపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అనుష్క, సోనూ సూద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్ర రాజం విడుదలై నేటికి ఒకటిన్నర దశాబ్దం గడిచింది. ఏకంగా పది నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి' సరిగ్గా 15 ఏళ్ల క్రితం జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. అనుష్కకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు రాగా, పశుపతిగా మెప్పించిన సోనూ సూద్ ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ ఎడిటర్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ ఇలా మొత్తం పది నంది అవార్డులు గెలుచుకుంది అరుంధతి చిత్రం.
ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.'
'అరుంధతి' చిత్రం 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క తన సంతోషం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల హృదయాల్లో తనకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం కల్పించిన పాత్ర జేజమ్మ అని ట్వీట్ చేసిన అనుష్క.. ఇలాంటి చిత్రాన్ని అందించిన టీంకి, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

![]() |
![]() |