![]() |
![]() |
ఒక సినిమా చేసేందుకు హీరో, దర్శకుడు, నిర్మాత, ఇతర టెక్నీషియన్స్ ఎంతో కష్టపడతారు. మంచి టీమ్ వర్క్ ఉంటేనే మంచి సినిమాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నో అవాంతరాలు, మరెన్నో కారణాల వల్ల ఒక్కోసారి సినిమా షూటింగ్ లేట్ అవుతుంది. ఏదోలా సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ చెయ్యడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడమే కష్టమైన పని అని సినిమా వాళ్లు అంటుంటారు. అది నిజమేనని కొన్ని సినిమాల విషయంలో అనిపిస్తుంది. ఎంతో కష్టపడి చేసిన సినిమా రిలీజ్ అవకుండా వాయిదాలు పడుతూ ఉంటే అందులో నటించిన నటీనటులు, దర్శకుడు ఎంతో నిరాశకు లోనవుతారు.
తాజాగా విక్రమ్ నటించిన ‘తంగలాన్’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. తను చేసే ప్రతి క్యారెక్టర్‌ను ఓ తపస్సులా భావించి చేసే విక్రమ్ ఈ చిత్రంలోని తన క్యారెక్టర్‌ని కూడా ప్రాణం పెట్టి చేశాడు. 19వ శతాబ్దానికి చెందిన ఓ తెగకు నాయకుడిగా విక్రమ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 26న రిలీజ్ అవుతుందని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏ డేట్‌లో రిలీజ్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడానికి కారణం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్‌కి పంపిస్తున్నారట. అలా చేస్తే సినిమాకి మంచి అప్లాజ్ వస్తుందని భావించారు మేకర్స్. ఫెస్టివల్ కంప్లీట్ అయిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
![]() |
![]() |