![]() |
![]() |
సినిమా ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టొచ్చు, ఎలాంటి అంచనాలు లేని సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వొచ్చు. ఇక్కడ ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఎగ్జాంపులే సంక్రాంతి సినిమాల విషయంలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి సినిమాల మధ్య భారీ పోటీ ఏర్పడిరది. అది భారీ చిత్రాల మధ్య ఉంటే విశేషం కాకపోవచ్చు. కానీ, ఆ భారీ సినిమాల మధ్యలో ఓ అప్‌కమింగ్ హీరో సినిమా ఉంటే.. ఆ సినిమాయే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘హనుమాన్’ దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి టాప్ హీరోల సినిమాల మధ్యలో ‘హనుమాన్’ చిత్రాన్ని ఎంతో కాన్ఫిడెన్స్‌తో రిలీజ్ చేశారు మేకర్స్. పైగా ఒకరోజు ముందుగానే మీడియాకి కూడా చూపించారు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా చేస్తారు. అయితే వారి కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ నిజమని ప్రూవ్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాకి బ్రహ్మరథం పడుతూ సూపర్‌హిట్ టాక్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు.
మిగతా హీరోల సినిమాల బడ్జెట్‌తో పోలిస్తే ‘హనుమాన్’ చిత్రానికి పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రశాంత్‌వర్మ. గ్రాఫిక్స్‌తో చేసే సినిమా అనగానే కొందరు డైరెక్టర్లు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించి నిర్మాతకు భారాన్ని పెంచేస్తుంటారు. అలాంటిది 25 కోట్లతో వంద కోట్ల సినిమా లుక్‌ని తీసుకొచ్చాడు ప్రశాంత్‌వర్మ. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ప్రశాంత్‌ను చూసి గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండే సినిమాలను ఎలా తియ్యాలో మిగతా దర్శకులు నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ రచ్చ అంతా ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ జరుగుతోంది. ప్రభాస్‌తో ఓం రౌత్ చేసిన ‘ఆదిపురుష్’ని ఈ సందర్భంగా తెరపైకి తెస్తున్నారు. నిర్మాతలతో వందల కోట్లు ఖర్చు పెట్టించి నాసిరకం గ్రాఫిక్స్‌తో అతను చేసిన ‘ఆదిపురుష్’ చిత్రానికి ఎంతటి పరాభవం ఎదురైందో అందరికీ తెలిసిందే. హనుమాన్ చిత్రంతో ఆదిపురుష్‌ను కంపేర్ చేస్తూ నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్‌ని ఆడుకుంటున్నారు. హనుమాన్ రిజల్ట్ విషయం పక్కన పెడితే వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే దర్శకులను మెయిన్‌గా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |