![]() |
![]() |
అభిమానులు ప్రేమగా ‘కెప్టెన్’ అని పిలుచుకునే విజయకాంత్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28 గురువారం చికిత్స పొందుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. విజయకాంత్ వయస్సు 70 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆనారోగ్యానికి గురి కావడంతో అయన్ను హాస్పిటల్ జాయిన్ చేశారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఇటీవల ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే డిసెంబర్ 27న మరోసారి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అయితే రెగ్యులర్ చెకప్స్ కోసమే ఆయన జాయిన్ అయ్యారని, పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని విజయకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన మరణించారంటూ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలి వెళుతున్నారు. దీంతో పోలీస్ శాఖ చెన్నయ్‌లోని మియాట్ ఇంటర్నేషల్ హాస్పిటల్ వద్ద, విజయకాంత్ నివాసం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఒకే సంవత్సరంలో 18 సినిమాలు విడుదలైన ఘనత విజయకాంత్‌ది!
విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. నటుడిగా మారిన తర్వాత తన స్క్రీన్ నేమ్‌ను విజయకాంత్‌గా మార్చుకున్నారు. ఆగస్ట్ 25, 1952లో జన్మించిన విజయకాంత్ చాలా ఆలస్యంగా చిత్రరంగంలోకి ప్రవేశించారు. 27 సంవత్సరాల వయసులో ఆయన తొలి చిత్రం విడుదలైంది. 1979లో వచ్చిన ‘ఇనుక్కుమ్ ఇలమై’ చిత్రం ద్వారా విలన్‌గా తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2015 వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు విజయకాంత్. హీరోగా మారిన తర్వాత కెరీర్ ప్రారంభంలో అపజయాలు ఆయన్ను వెంటాడాయి. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఆయనకు ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పనిచేయాల్సి వచ్చింది. 1984లో విజయకాంత్ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి అంటే ఆయన ఎంత బిజీ హీరోనో అర్థం చేసుకోవచ్చు. ఆయన కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. అందులో 20కి పైగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌కు వన్నె తెచ్చిన విజయకాంత్‌కు ‘కెప్టెన్ ప్రభాకర్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అభిమానులంతా ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిలుచుకునేవారు. అప్పటికి ఛలామణిలో ఉన్న హీరోల్లో పర్సనాలిటీ పరంగా కాస్త హెవీగానే ఉండే విజయకాంత్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అమితమైన వేగాన్ని ప్రదర్శిస్తూ యాక్షన్ హీరోగానూ పేరు తెచ్చుకున్నారు.
ముందుగా పారితోషికం తీసుకోని ఏకైక హీరో!
విజయకాంత్ చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాలు, దేశభక్తితో కూడుకున్న సినిమాలు చెయ్యాలంటే ఎప్పుడూ ముందుండేవారు. సందేశాత్మక చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఏక కాలంలో చేసేవారు. ఎప్పుడూ నిర్మాతలకు అందుబాటులో ఉంటూ నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. అందరు హీరోల్లా సినిమా ప్రారంభానికి ముందు రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదు. సినిమా రిలీజ్ అయ్యే ముందు పారితోషికాన్ని అందుకునేవారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట.
పోలీస్ ఆఫీసర్ అంటే విజయకాంత్.. ఆ క్యారెక్టర్‌కే వన్నె తెచ్చిన హీరో!
విజయకాంత్ సినిమా కెరీర్‌లో విశేషం ఏమిటంటే.. అతను చేసిన 150 సినిమాలూ తమిళ్‌లోనే చేశారు. ఇతర భాషల్లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే దేశవ్యాప్తంగా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సూపర్‌హిట్ సినిమాలు వివిధ భాషల్లో డబ్ అయ్యేవి. ముఖ్యంగా తెలుగులో విజయకాంత్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీలో కూడా ఆయన నటించిన సినిమాలు డబ్ అయి విజయవంతం అయ్యాయి. తెలుగులో ఘనవిజయం సాధించి అప్పట్లో సంచలనం సృష్టించిన ‘ఎర్రమల్లెలు’ చిత్రాన్ని విజయకాంత్ హీరోగా ‘శివప్ప మల్లి’ పేరుతో తమిళ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమా ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత విజయకాంత్‌ను ‘పురట్చి కలైంజర్(విప్లవ కళాకారుడు) అని పిలిచేవారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఆయన్ను కెప్టెన్ అని పిలవడం మొదలుపెట్టారు.
ఇతర హీరోలతోనూ మంచి అనుబంధం!
చాలా సినిమాల్లో ఇతర ప్రముఖ హీరోలతో కలిసి నటించారు విజయకాంత్. ‘అన్నై భూమి’ చిత్రంలో రాధా రవి, టైగర్ ప్రభాకర్‌తో కలిసి నటించారు. ‘ఈట్టి’ చిత్రంలో కన్నడ హీరో విష్ణువర్థన్‌తో, ‘మనకనక్కు’ చిత్రంలో కమల్‌హాసన్‌తో, ‘వీరపాండియన్’ చిత్రంలో శివాజీ గణేశన్‌తో కలిసి నటించి ఇతర హీరోలతో తనకున్న మంచి అనుబంధాన్ని తెలియజేశారు. రజనీకాంత్, కమల్‌హాసన్ టాప్ హీరోలుగా వెలుగొందుతున్న సమయంలో వారికి గట్టి పోటీ ఇచ్చిన ఏకైక హీరో విజయకాంత్.
విజయకాంత్‌ను వరించిన పలు పురస్కారాలు!
విజయకాంత్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘విరుధగిరి’. తన బావ ఎల్.కె.సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలను నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఆనరరీ అవార్డు(ఎంజిఆర్ పురస్కారం) అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే కళైమామణి అవార్డును కూడా విజయకాంత్ సొంతం చేసుకున్నారు. 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ టెన్ లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు, 2011లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్‌మెంట్ విజయకాంత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవికాక సినిమాల్లోని నటనకుగాను ఫిలింఫేర్‌తోపాటు పలు అవార్డులు ఆయన్ను వరించాయి.
రాజకీయ నేతగా చెరగని ముద్ర వేసిన విజయకాంత్!
ఇక ఆయన రాజకీయ జీవితం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. 2005 సెప్టెంబరు 14న విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించారు. దీని తెలుగు అర్ధం.. ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య. అతని పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ విజయకాంత్ పోటీ చేసిన ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. అతని నేతృత్వంలోని డిఎండికె 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10% మంది, లోక్‌సభ ఎన్నికల్లో 10.1% ఓటర్లను సంపాదించింది. అధ్యయనం ప్రకారం, ఇది సుమారు 25 నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు మార్జిన్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. 2006 ఎన్నికల పోలింగ్‌లో అతని పార్టీ ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ఓట్ల కంటే ఎక్కువ డి.ఎం.కె ఓట్లను పొందగలిగిందని తేలింది. ఏప్రిల్ 13న జరిగిన 2011 ఎన్నికల్లో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎఐఎడిఎంకె)తో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. విజయకాంత్ పార్టీ పోటీ చేసిన 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అతని పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ద్రావిడ మున్నేట కజగం (డిఎంకె) కంటే ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది.
![]() |
![]() |