![]() |
![]() |

ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నిర్మాత దిల్ రాజు తప్ప తనని ఎవరూ విష్ చేయలేదని, తెలుగు సినీ పరిశ్రమ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు తప్ప ఎవరూ నాకు ఫోన్ చేయలేదు, సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటూ ఆయన ఫైర్ అయినంత పని చేశారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డిని కూల్ చేసే పనిలో సినీ పరిశ్రమ ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ లో దిల్ రాజుకి తిరుగులేదు. పైగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దానికి తోడు సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులతో కూడా ఆయన సత్సంబంధాలను కలిగి ఉంటారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి అలా బాధ్యతలు చేపట్టారో లేదో.. దిల్ రాజు ఫోన్ చేసి మంచి మార్కులు కొట్టేశారు. కానీ కోమటిరెడ్డి మాత్రం దిల్ రాజు ఒక్కడే విష్ చేయడం ఏంటని, సినీ పరిశ్రమపై అసహనం వ్యక్తం చేశారు. ఓ రకంగా తాను ఒక్కడే ప్రత్యేకంగా విష్ చేసి.. మిగతా వారిపై అనవసరంగా అసహనం కలిగేలా చేశారు దిల్ రాజు. దీంతో ఇప్పుడు కోమటిరెడ్డికి సినీ పరిశ్రమను దగ్గర చేసే బాధ్యతను కూడా దిల్ రాజే తీసుకున్నారట.
పలువురు సినీ ప్రముఖులతో కలిసి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు వెళ్లి.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలవబోతున్నారు. మరి ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీతోనైనా కోమటిరెడ్డి కూల్ అవుతారేమో చూడాలి.
![]() |
![]() |