![]() |
![]() |
సంక్రాంతి సినిమాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. స్టార్ హీరోలు చాలామంది తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్ సినిమాలకు కలెక్షన్లపరంగా ఎంతో ప్లస్ అవుతుంది. అందుకే హీరోల దృష్టి ఎప్పుడూ సంక్రాంతి మీదే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సంక్రాంతికి రిలీజ్ అయిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. ఈసారి సంక్రాంతికి మరో ప్రత్యేకత ఉంది. నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’, మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగిల్’ వంటి భారీ సినిమాలతోపాటు అప్‌కమింగ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ చిత్రం కూడా బరిలోకి దిగింది. ఏవిధంగా చూసినా తేజ స్టార్ హీరోలకు పోటీ కాదు. ఎందుకంటే ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు యంగ్ హీరోగా చిన్న సినిమాలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అనుకోకుండా సంక్రాంతి బరిలోకి దిగి స్టార్ హీరోలకు పోటీగా నిలబడే అవకాశం తేజకి వచ్చింది. మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 12న విడుదలవుతుండగా, అదేరోజు ‘హనుమాన్’ చిత్రాన్ని కూడా విడుదల చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదివరకెన్నడూ లేని విధంగా ఒక యంగ్ హీరోతో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ‘హనుమాన్’ తెరకెక్కింది.
కేవలం కంటెంట్‌ని మాత్రమే నమ్మి ‘హనుమాన్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు మేకర్స్. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో సంస్థ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించింది. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్ హీరో పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేస్తూ సినిమాకి మంచి హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యేలాగే ఉన్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో హనుమంతుడిని ప్రస్తుత ప్రపంచానికి ముడిపెడుతూ డిఫరెంట్ కంటెంట్‌తో వస్తోందని టీజర్, పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా 3 నిమిషాల 28 సెకన్ల ‘హనుమాన్’ ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో లాంచ్ చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అందమైన లొకేషన్లలో, చక్కని సినిమాటోగ్రఫీ, థ్రిల్ చేసే గ్రాఫిక్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ ఓ రేంజ్‌లో వచ్చింది. తనకెలాంటి అతీత శక్తులు ఉన్నాయో తెలియని హనుమ తన అక్కతో కలిసి జీవిస్తుంటాడు. మరోపక్క విధ్వంసం సృష్టించి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడమే లక్ష్యంగా ఉన్న విలన్.. హనుమ గురించి తెలుసుకొని తన మనుషుల్ని అతనిపై దాడికి పంపిస్తాడు. ఆ క్రమంలో అతను సముద్ర గర్భంలోకి వెళ్లిపోతాడు. అప్పుడు అంజనీపుత్రుడు అతన్ని బయటికి తెస్తాడు. ఆపై తన శక్తులు ఉపయోగించి శత్రు సంహారం చేస్తాడు.. ఇదీ క్లుప్తంగా కథ.
ఈ కథ వింటుంటే చిన్నప్లిలలతోపాటు పెద్దవారు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చక్కని విజువల్స్‌తో సినిమాని ఆద్యంతం చిత్రీకరించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎంతో రిచ్‌గా ఉండడంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. కంటెంట్ పరంగా సాధారణంగా అనిపించినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం, శివేంద్ర ఛాయాగ్రహణం సినిమాకి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీపడ గల సత్తా ‘హనుమాన్’ చిత్రానికి ఉందని అందరూ భావిస్తున్నారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే కథాంశం, ప్రజెంటేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్ణణలుగా చెప్పొచ్చు. మరి ఈ సంక్రాంతి సీజన్ ‘హనుమాన్’కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |