![]() |
![]() |

ఈ ఏడాది వేసవికి సౌత్ ఇండియాలో మరికొన్ని విభిన్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి పోటీ రంజుగా కొనసాగుతోంది. తెలుగు నాట చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'గా బాలయ్య 'వీరసింహారెడ్డి'గా వస్తున్నారు. మరోవైపు తల అజిత్ నటించిన 'తెగింపు', దళపతి విజయ్ నటించిన 'వారసుడు' చిత్రాలు డబ్బింగ్ గా విడుదల కాబోతున్నాయి.
ఇక తెలుగులో పోటీ ఇలా ఉంటే తమిళంలో మాత్రం విజయ్, అజిత్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. విజయ్ 'వారీసు', అజిత్ 'తునీవు' చిత్రాలు నువ్వా నేనా అన్న రీతిలో ముందుకు పోతున్నాయి. చిరు 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి'లను మనం గోదావరి ప్రాంతం సంక్రాంతి కోడిపుంజులతో పోలిస్తే విజయ్, అజిత్ మధ్య పోటీని జల్లికట్టుతో పోల్చవచ్చు. ఇక ఈ ఏడాది వేసవికి తెలుగులో ముఖ్యంగా డిఫరెన్స్ జోనర్లలో ఒకే ఒక్క నెలలో పలు సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అసలు సిసలైన సినిమా పండుగ కనిపించనుంది.
సమ్మర్ హాలిడేస్ కు పలువురు నిర్మాతలు ఇప్పటినుంచే కర్చీఫ్‌లు వేయడం మొదలు పెట్టేశారు. మొదటగా మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' ఏప్రిల్లో విడుదలకావడం గ్యారంటీ. తమిళ 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'బోళా శంకర్'ను ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రం కూడా తెలుగులో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌లో ఒకేసారి ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లు ఒకే రోజున రాబోతున్నారని అర్థమవుతుంది.
రాఘవ లారెన్స్ 'రుద్రుడు' కూడా ఇదేనెలలో విడుదల కానుంది. మేగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఈసారి డిఫరెంట్ జోనర్లో సక్సెస్ అందుకోవాలని తన 'విరూపాక్ష' చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఇక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' ఏప్రిల్ 21న సౌత్ ఇండియాలో విడుదల కానుంది. మణిరత్నం ప్రాజెక్ట్ అయిన 'పొన్నియన్ సెల్వన్' రెండో భాగం ఏప్రిల్ చివరి వారంలో రానుంది. ఈ చిత్రానికి ఏప్రిల్ 28న డేట్ ఫిక్స్ చేశారు. మరి ఏప్రిల్ నెలలో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం అగ్రస్థానంలో నిలిచి వేసవి విజేతగా నిలుస్తుందో అనే ఆసక్తి ఇప్పటినుంచే మొదలైంది.
![]() |
![]() |