![]() |
![]() |

గతంలో కూడా పలు రీమేక్ చిత్రాలు వచ్చేవి. పలు చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయినప్పుడు దాదాపుగా తెలుగు దర్శకులే వాటిని డైరెక్ట్ చేసేవారు. కానీ కొన్నింటికి మాత్రం ఒరిజినల్ వెర్షన్ దర్శకుడి చేతనే డైరెక్షన్ చేయించేవారు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్ లో నిన్నటిదాకా ఉన్న ట్రెండ్ ఏమిటయ్యా అంటే తెలుగు హీరోలు కోలీవుడ్ దర్శకులతో పనిచేస్తూ ఉంటారు. చిరంజీవి నుంచి నాని వరకు దాదాపు అందరు తమిళ దర్శకులతో పనిచేసిన వారే. అంటే తెలుగు దర్శకుల కంటే తమిళ దర్శకులు బాగా తీస్తారనే నమ్మకం ఒకవైపు, ఒరిజినల్ వెర్షన్ దర్శకుడే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తే మరింత బాగా అవుట్‌పుట్ వస్తుందనే నమ్మకం మరోవైపు ఉండటం వల్ల ఇలా చేసేవారు.
నాటి బాలచందర్, భారతీరాజా, బాలూ మహేంద్ర, గౌతమ్ వాసుదేవ మీనన్, మణిరత్నం, శంకర్, మురుగదాస్, లింగుస్వామి, విష్ణువర్దన్, సముద్రఖని ఇలా ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను దిల్రాజు మారుస్తున్నాడా?.. అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే దిల్‌రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'ఆర్‌సి 15' అనే భారీ చిత్రం తీస్తున్నారు. ఇంతవరకు ఓకే కానీ ఆయన వంశీ పైడిపల్లి వంటి తెలుగు దర్శకునితో కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా 'వారీసు' చిత్రం తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
మరోవైపు తాజాగా మరో తెలుగు దర్శకుడైన హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో మరో చిత్రాన్ని దిల్ రాజు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుంది. ఇటీవల క్రియేటివిటీ పరంగా, టాలెంట్ పరంగా, స్టార్స్‌ను హ్యాండిల్ చేయడంలో కూడా మన దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ స్టార్స్‌తో తమిళ దర్శకులను డైరెక్ట్ చేయించడం మానేసి, కోలీవుడ్ స్టార్స్‌ని మన డైరెక్టర్స్ హ్యాండిల్ చేసేలా ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు.
తెలుగు దర్శకుల ప్రతిభ చూపించేలా వారిని డైరెక్ట్ చేయించడం కూడా ఒక విధంగా కొత్త ట్రెండ్ అని చెప్పాలి. ఇది ఒక విధంగా సరికొత్త శకానికి నాంది పలికిందని.. దానికి దిల్ రాజు ఆద్యుడిగా మిగిలిపోతాడని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతానికి దిల్ రాజు తెలుగు హీరోలను వదిలేసి తెలుగు దర్శకులను పట్టుకుంటున్నాడు మరోవైపు తమిళ దర్శకులను వదిలేసి తమిళ హీరోల వైపు చూస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఆయన ఎందరు తెలుగు దర్శకులను కోలీవుడ్‌కి పరిచయం చేస్తారు? ఎంతమంది కోలీవుడ్ స్టార్స్‌తో పనిచేస్తారనే విషయం ఆసక్తిని కలుగుజేస్తోంది.
![]() |
![]() |