![]() |
![]() |

చాలా గ్యాప్ తర్వాత టాప్ కమెడియన్ వడివేలు ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 'నాయి శేఖర్ రిటర్న్స్', 'చంద్రముఖి 2', 'మామన్నన్'.. ఇలా ఆయన ప్రస్తుత సినిమాల జాబితా కొనసాగుతోంది. మరి కొన్ని సినిమాల్లో నటించడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. కాగా ఒక విషయంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. వడివేలు కొన్నేళ్ల క్రితం 'ఇమ్‌సై అరసన్ 23' పులికేసిలో నటించాడు. అది భారీ విజయం సాధించడంతో, ఆయన 'ఇమ్‌సై అరసన్ 24వ పులికేసి'లో నటించడానికి సంతకం చేశాడు.
అందుకు నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ షూటింగ్ ప్రారంభం కాగానే వడివేలు చాలా ఇబ్బందులు పెట్టి సినిమాను సగంలోనే వదిలేశాడు. దాంతో అడ్వాన్స్ తిరిగివ్వమని నిర్మాతలు అడిగితే, ఇచ్చేందుకు నిరాకరించాడు. అది పెద్ద వివాదానికి దారితీసింది.
ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వడివేలు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే తనకు పెద్ద మనుషులు తెలుసని బహిరంగంగా బెదిరిస్తున్నాడని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. వడివేలు ఇప్పటికే డీఎంకే పార్టీ తరపున ప్రచారం చేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆయన ఇంత అహంకారపూరితంగా మాట్లాడడానికి ఇదే కారణమని అంటున్నారు.
డబ్బులిచ్చి సినిమాలో నటించమని అడిగితే ఒప్పుకోలేదనీ, డబ్బు మొత్తం పోయి ఏం చేయాలో తెలియడం లేదనీ నిర్మాతలు వాపోతున్నారు. చాలా ఏళ్లుగా వడివేలు వ్యవహరిస్తున్న తీరు గురించే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
![]() |
![]() |