![]() |
![]() |

కామెడీ, సెంటిమెంట్ సినిమాలతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో యాక్షన్ సినిమాలతోనూ అదే స్థాయిలో అలరిస్తాడు విక్టరీ వెంకటేష్. తమిళ్ లో విక్రమ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'జెమిని'ని తెలుగులో అదే పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. అక్టోబర్ 11, 2002 న విడుదలైన ఈ చిత్రం నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
వెంకటేష్, నమిత జంటగా సరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జెమిని'(2002). అదే ఏడాది ఆగస్ట్ లో విడుదలైన 'సొంతం'తో తెలుగు తెరకు పరిచయమైన నమిత స్క్రీన్ నేమ్ 'జెమిని'లో భైరవి కావడం విశేషం. ఆ తర్వాత నమితగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో జెమిని అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో వెంకటేష్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలోని కామెడీ, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ చిత్రాన్ని ఏ.వి.యం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్ సరవన్ నిర్మించగా.. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించాడు. ఆయన స్వరపరిచిన అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి. 'బ్రహ్మ ఓ బ్రహ్మ'(కులశేఖర్) పాటకి తప్ప మిగతా అన్ని పాటలకు వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించడం విశేషం. 'చెలి చెడుగుడు జెమిని', 'నడక చూస్తే వయ్యారం' వంటి సాంగ్స్ సూపర్ హిట్ కాగా, 'చుక్కల్లో కెక్కినాడు' పాట ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో కళాభవన్ మణి, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వేణు మాధవ్, సుధాకర్, కోట శ్రీనివాస రావు, ఆహుతి ప్రసాద్, సుజాత, మురళి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే సరణ్ అందించగా, పోసాని కృష్ణ మురళి సంభాషణలు రాశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఎ. వెంకటేష్, ఎడిటర్ గా సురేష్ వ్యవహరించారు.
![]() |
![]() |