![]() |
![]() |

శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' సినిమాను చుట్టుముడుతున్న వివాదాలు, విమర్శలు దర్శక నిర్మాతలను కలవరపరుస్తున్నాయి. ఇటీవల ఆ సినిమా టీజర్ వివాదాలకు ఆజ్యం పోసింది. అనేకమంది ఆ టీజర్‌లోని అంశాలను తూర్పారబడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది పాత్రధారుల గెటప్‌లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ గెటప్‌పై, ఆంజనేయుని రూపంపై వస్తోన్న విమర్శలను తట్టుకోవడం టీమ్‌కు తలకు మించిన పనవుతోంది. భారతీయులకు అత్యంత పూజనీమైన రామాయణ కావ్యాన్ని ఆదిపురుష్‌లో తప్పుగా చూపిస్తున్నారంటూ డైరెక్టర్ ఓం రౌత్‌ను తిట్టిపోస్తున్నారు.
రావణుడు ఎలా ఉంటాడో, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలియనంత అజ్ఞానంలో దర్శకుడు ఉన్నాడా?.. అని వారు మండిపడుతున్నారు. రామాయణాన్ని సరిగా అధ్యయనం చేయకుండా సినిమా ఎలా తీస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరో రకమైన అంశాల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మేకింగ్ పరంగా చాలా గొప్పగా ఉంటుందనుకుంటే, వీడియో గేమ్ తరహాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ రకమైన విమర్శలు, తిట్లు చూసి ప్రభాస్, ఓం రౌత్ తదితరులంతా షాకయ్యారని టీమ్ మెంబర్స్ నుంచి వస్తోన్న సమాచారం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయోధ్య నుంచి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆదిపురుష్ మూవీని విడుదల కాకుండా నిషేధించాలని అయోధ్యలోని రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రామాయణంలో వర్ణించిన విధంగా రాముడు, రావణుడు, హనుమంతుడు తదితర పాత్రలను ఆదిపురుష్‌లో చూపించలేదనీ, హిందూమత విశ్వాసాలను దెబ్బతీసే తరహాలో ఆ పాత్రల ఆహార్యం, వ్యవహారం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఆయా పురాణ పురుషులను అగౌరవపరిచేలా ఆ పాత్రలు కనిపిస్తున్నాయనీ, వెంటనే ఆ సినిమాని నిషేధించాలని తాము డిమాండ్ చేస్తున్నామనీ ఆయన అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్‌లో ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తీస్తున్నారని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కూడా విమర్శించారు. ఇతిహాసాలు, చరిత్రపై సినిమాలు తీయడంలో తప్పు లేదనీ, అయితే స్వప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీలు సృష్టించడం కరెక్ట్ కాదని ఆయనన్నారు. అయోధ్యలోనే అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ రిలీజైన విషయం గమనార్హం.
![]() |
![]() |