![]() |
![]() |

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. నటుడిగానే కాకుండా ఆయన తన మంచి మనసుతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన దూరమైనా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన 'చక్రవ్యూహ' ఇప్పుడు 'సివిల్ ఇంజినీర్'గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.
2016 లో విడుదలైన 'చక్రవ్యూహ' చిత్రం శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా 'సివిల్ ఇంజినీర్' పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. దసరా సందర్భంగా 'సివిల్ ఇంజనీర్' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కన్నడ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు మరియు దీనిని T.N.సూరిబాబు నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
కోలీవుడ్ చిత్రం 'ఇవాన్ వెరమాతిరి'కి కన్నడ రీమేక్ గా తెరకెక్కిన 'చక్రవ్యూహ' చిత్రంలో రచితా రామ్ హీరోయిన్ కాగా, తమిళ నటుడు అరుణ్ విజయ్ విలన్ గా నటించాడు. తమిళ దర్శకుడు ఎం శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోహిత్ నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో 'గెలేయ గెలేయ' పాటను కన్నడలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆలపించడం విశేషం. మరి తెలుగులో ఈ పాట ఎవరు పాడతారో చూడాలి.
![]() |
![]() |