![]() |
![]() |

టాలీవుడ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సమయంలో ఒకేరోజు విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' రెండు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమాలు ఒక్కోటి రూ.35 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రాలు విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి కూడా అడుగుపెట్టాయి. అయితే ఇప్పటికీ 'సీతా రామం' చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతుండగా 'బింబిసార' మాత్రం వెనుకబడిపోయింది. దీంతో 'బింబిసార'ను ఎందుకలా వదిలేసారు అన్న చర్చలు మొదలయ్యాయి.
సినిమాకి కంటెంట్ తో పాటు ప్రమోషన్ కూడా ముఖ్యమే. మంచి కంటెంట్ కి ప్రమోషన్ తోడైతే మరింతమందికి సినిమా చేరువై కలెక్షన్లు పెరుగుతాయి. కానీ ఈ విషయంలో బింబిసార టీమ్ ఎందుకో వెనుకబడిపోయింది. సోషల్ మీడియాలో సైతం సినిమాని పెద్దగా ప్రమోట్ చేసుకోవట్లేదు. ఓ వైపు 'సీతా రామం'ను నిర్మించిన వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. కలెక్షన్ల పోస్టర్లు, హిందీ వెర్షన్ విడుదల తేదీ ప్రకటన, సినిమాని ప్రశంసిస్తూ వచ్చిన ట్వీట్లకు రీట్వీట్లు.. ఇలా ఏదో ఒక రకంగా ప్రమోట్ చేస్తూ సినిమా పేరు ఆడియన్స్ లో నానేలా చేస్తోంది.
కానీ 'బింబిసార' టీమ్ మాత్రం ప్రమోషన్ చేయకుండా మధ్యలో వదిలేసినట్లు అనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మితమై, బ్లాక్ బస్టర్ అయిన సినిమాని మూడు వారాలకే ఇలా ఎందుకు వదిలేసారో అర్థంకాని పరిస్థితి. కనీసం ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా కొద్దిరోజులుగా 'బింబిసార' గురించి ఊసే లేదు. ఎప్పుడో 8-9 రోజుల క్రితం మూడో వారంలోకి అడుగుపెట్టిందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారంతే. ఆ తర్వాత కనీసం ఒక్క ట్వీట్ కూడా లేదు. కంటెంట్ బాగుండి, అందరి మెప్పు పొందిన ఈ చిత్రాన్ని సరిగా ప్రమోట్ చేస్తే అదనంగా ఇంకో 5-10 కోట్ల షేర్ వస్తుందని.. కానీ ఎందుకనో 'బింబిసార' టీమ్ పట్టించుకోవట్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
![]() |
![]() |