![]() |
![]() |

నటి మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న చెన్నైలో తుది శ్వాస విడిచారు. నివేదికల ప్రకారం, ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మరణించారు. విద్యాసాగర్‌కు మార్చిలో కోవిడ్-19 సోకింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తన భర్త మృతి చుట్టూ తిరుగుతున్న వదంతులను జూలై 1న తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఖండించారు మీనా. ఈ కష్ట కాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తన కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా మీడియాను అభ్యర్థించారు మీనా. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని కోరారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన నోట్‌లో, "నా ప్రియమైన భర్త విద్యాసాగర్‌ను కోల్పోవడంతో నేను చాలా విషాదంలో ఉన్నాను. మా ప్రైవసీని గౌరవించాలని, ఈ పరిస్థితికి సానుభూతి చూపాలని మనసారా అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ విషయంలో ఇకనుంచీ ఎలాంటి తప్పుడు సమాచారాన్నైనా ప్రసారం చేయడాన్ని ఆపండి. ఈ కష్ట కాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచిన మంచి హృదయాలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమ వంతు ప్రయత్నం చేసిన వైద్య బృందానికి, మన ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి, రాధాకృష్ణన్ ఐఏఎస్, సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, మీడియాకు, ప్రేమనూ, ప్రార్థనలూ పంపిన నా ప్రియమైన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థాంక్యూ, మీనా సాగర్" అంటూ రాసుకొచ్చారు.
దక్షణాదిలో మీనా ప్రముఖ నటిగా పేరుపొందారు. తెలుగు, తమిళ భాషా చిత్రసీమల్లో అగ్రనటిగా రాణించారు. 2009లో ఆమె ఒక సంప్రదాయ వేడుకలో ఐటీ నిపుణులైన విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. జూన్ 28న విద్యాసాగర్ మృతి చెందారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. విద్యాసాగర్‌కు మార్చిలో కోవిడ్-19 సోకినప్పటి నుంచి ఆరోగ్యం బాగా లేదు. జూన్ 29న చెన్నైలోని బీసెంట్ నగర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్, మీనా దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది.
![]() |
![]() |