![]() |
![]() |

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదగటం అంత సులభం కాదు. మనందరికీ నానిగా తెలిసిన ఘంటా నవీన్ బాబు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేచురల్ స్టార్ గా ఎదిగాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా, రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన నాని.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అష్టా చమ్మా'(2008) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన నేచురల్ పర్ఫామెన్స్ తో మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న నాని.. ఆ తర్వాత 'రైడ్', 'భీమిలి కబడ్డీ జట్టు' వంటి సినిమాలతో మెప్పించాడు. ఇక 2010 లో వచ్చిన 'అలా మొదలైంది' సినిమా నానికి బిగ్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'పిల్లజమీందార్'లో తన సహజ నటనతో కట్టిపడేసిన నాని.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమాతో స్టార్ గా మారాడు. అందులో నాని పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసుకున్నాడు.

'ఈగ' తర్వాత రెండేళ్ల పాటు పరాజయాలు ఎదుర్కొన్న నాని.. 2015 లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమా నానికి మరో బిగ్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి నాని విజయ పరంపర కొనసాగింది. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', 'జెంటిల్ మన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'MCA' ఇలా వరుస విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' సినిమాలతో కాస్త నిరాశపరిచిన నేచురల్ స్టార్.. 2019 లో వచ్చిన 'జెర్సీ' మూవీలో అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు తను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరనే అంతలా జీవించాడు. ఇక గతేడాది విడుదలైన 'శ్యామ్ సింగ రాయ్'లో ద్విపాత్రాభినయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్' పాత్ర నటుడిగా నానిని మరో పది మెట్లు పైకి ఎక్కించింది.

ఇప్పుడు 'అంటే సుందరానికీ' సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. నాని నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానున్నాయని టీజర్, ట్రైలర్ తోనే అర్థమైపోయింది. ఈ సినిమాతో నేచురల్ స్టార్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆశిద్దాం.
-గంగసాని
![]() |
![]() |