![]() |
![]() |

మావయ్య సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా హీరో సుధీర్‌బాబు తన తర్వాతి సినిమా 'మామా మశ్చీంద్ర'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఊపు తెప్పించే మ్యూజిక్‌కు అనుగుణంగా డాన్స్ చేస్తూ కనిపించాడు సుధీర్. పనిలో పనిగా తన కండలు తిరిగిన ఒంటిని కూడా ప్రదర్శించాడు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ మూవీలో అతను ఒక డిఫరెంట్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు.
సోషల్ మీడియాలో 'మామా మశ్చీంద్ర' గ్లిమ్స్ వీడియోను షేర్ చేసిన సుధీర్, "సూపర్‌స్టార్ కృష్ణ గారి బర్త్‌డే సందర్భంగా 'మామ మశ్చీంద్ర' నుంచి ఓ చిన్న గ్లిమ్స్!! హ్యాపీ బర్త్‌డే మామయ్యా. నాకు, ఎంతోమంది ఔత్సాహిక నటులకు ఎప్పటికీ స్ఫూర్తి #HBDLegendarySSK " అని రాసుకొచ్చాడు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన ఫస్ట్ లుక్‌ను సుధీర్ రిలీజ్ చేశాడు. ఆ సందర్భంగా పోస్టర్లలో 'నైట్రో స్టార్' అనే ట్యాగ్‌ను తగిలించుకున్నాడు. ఇప్పటిదాకా చేయని పలు రకాల ఛాయలున్న క్యారెక్టర్‌ను ఈ మూవీలో అతను చేస్తున్నాడు.
ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కొంతమంది పేరుపొందిన నటీనటులు నటిస్తుండగా, టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తోన్న ఈ మూవీని దివంగత నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పిస్తున్నారు.
కాగా సుధీర్ నటించిన మరో రొమాంటిక్ కామెడీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. కృతి శెట్టి నాయిక అయిన ఈ మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు.
![]() |
![]() |