![]() |
![]() |

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో కింగ్ నాగార్జున ఒకరు. ప్రయోగాలకు పెద్దపీట వేసే కథానాయకుడిగా తెలుగునాట ప్రత్యేక గుర్తింపు పొందిన నాగ్ కి.. మే 23 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఇదే రోజు ఆయన నటించిన మొదటి సినిమా `విక్రమ్` (1986) తెరపైకి వచ్చింది.
1983 నాటి హిందీ చిత్రం `హీరో` (జాకీష్రాఫ్ - మీనాక్షి శేషాద్రి) ఆధారంగా రూపొందిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని సీనియర్ డైరెక్టర్ వి. మధుసూదనరావు తెరకెక్కించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించారు. సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. ఇందులో నాగ్ కి జంటగా శోభన నటించగా.. సత్యనారాయణ, కన్నడ ప్రభాకర్, చంద్రమోహన్, సుధాకర్, కాంతారావు, అన్నపూర్ణ, రమాప్రభ, రాజ్యలక్ష్మి, పుష్పలత ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అనూరాధ ఓ ప్రత్యేక గీతంలో ఎంటర్టైన్ చేసింది.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``కొండ కోనల్లో``, `డింగ్ డాంగ్``, ``ఓ కాలమా``, ``నీవే రాగం``, ``నీ ప్రేమ నా ప్రాణం``.. అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 1986 మే 23న విడుదలై మంచి విజయం సాధించిన `విక్రమ్`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది, అంటే.. నాగ్ నటప్రస్థానానికి నేటితో 36 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |