![]() |
![]() |

మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మేశాం కదా అని.. ఆ సినిమా విడుదలయ్యాక ప్లాప్ టాక్ వస్తే సైలెంట్ అయిపోతారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం అపజయాన్ని అంత ఈజీగా ఒప్పుకోరు. తమ సినిమా హిట్ అని చెప్పి బలంగా నిలబడతారు. అలా నిలబడే వారిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అందరికన్నా ముందు ఉంటుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' గతేడాది డిసెంబర్ 17న విడుదలైంది. మొదటిరోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. చాలామంది ఈ సినిమాని యావరేజ్ అన్నారు. ఆ సమయంలో మైత్రి కృంగిపోలేదు. ప్రమోషన్స్ మరింత పెంచింది. కట్ చేస్తే పుష్ప-1 కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సంచలన విజయాన్ని అందుకుంది. పుష్ప మేనరిజమ్స్, సాంగ్స్, డైలాగ్స్ ఓ ఊపు ఊపాయి. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ సైతం పుష్ప మేనియాలో మునిగితేలారు. ఇప్పుడు పుష్ప పార్ట్-2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
అలాగే 'పుష్ప-1' తర్వాత మైత్రి నిర్మించిన 'సర్కారు వారి పాట' ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మైత్రి మాత్రం విడుదలకు ముందు ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో.. విడుదలయ్యాక కూడా మొదటి రోజు నుంచే తమ సినిమా హిట్ అని బలంగా నిలబడింది. ప్రమోషన్స్ పెంచింది.. సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. కట్ చేస్తే మళ్ళీ పుష్ప రిజల్ట్ రిపీట్ అయింది. ఐదు రోజుల్లోనే 'సర్కారు వారి పాట' వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా షేర్ తో సత్తా చాటింది. త్వరలోనే ఈ మూవీ వంద కోట్ల షేర్ మార్క్ అందుకునే అవకాశముంది.
మైత్రి సంస్థ తాము నిర్మించిన చిత్రాలపై నమ్మకంతో.. టాక్ తో సంబంధం లేకుండా భారీ ప్రమోషన్స్ తో సినిమాలను బ్లాక్ బస్టర్స్ గా మలుస్తుంది. తాజాగా ఇదే విషయమై మహేష్ బాబు కూడా మైత్రి సంస్థని అభినందించాడు. సినిమాని నిర్మించడం ఒకెత్తయితే.. డిస్ట్రిబ్యూషన్ జరిగి విడుదలయ్యాక, దానిని ప్రమోట్ చేసి బ్లాక్ బస్టర్ చేయడం మరో ఎత్తు అని అన్నాడు. ప్రొడ్యూసర్స్ కి ఉండాల్సిన ఈ బెస్ట్ క్వాలిటీ మైత్రి సంస్థకి ఉందని మహేష్ ప్రశంసించాడు.
![]() |
![]() |